ఒక పక్క బుల్లితెరపై సత్తా చాటుతూనే నటుడిగా, హీరోగా సినిమాల్లో కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సుడిగాలి సుధీర్.

సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, పండుగాడ్ సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ కి ఆ సినిమాలు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు.

అయినప్పటికీ సుధీర్ తన ప్రయాణాన్ని ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గాలోడు అనే సినిమాతో మన ముందుకు వచ్చారు.

మరి ఈ సినిమా సుధీర్ కి హిట్ ఇచ్చిందా? లేదా? గాలోడు సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ: ఒక పల్లెటూరులో రాజ్ (సుడిగాలి సుధీర్) అనే యువకుడు ఆవారాగా తిరుగుతుంటాడు. బాధ్యతలు లేకుండా, తల్లిదండ్రులని లెక్క చేయకుండా, పేకాట ఆడుతూ బతుకుతుంటాడు.

ఈ క్రమంలో పేకాట ఆడుతుండగా కొట్లాటలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు. దీంతో రాజు ఊరొదిలి హైదరాబాద్ కి పారిపోతాడు.

అక్కడ ఒక శుక్లని (గెహ్నా సిప్పీ) కొంతమంది ఆకతాయిలు అల్లరి చేస్తుంటే.. రాజు కాపాడతాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.

ఆ పరిచయాన్ని శుక్ల తన ఇంటికి తీసుకెళ్లి తండ్రితో మాట్లాడి ఒక ఉద్యోగం ఇప్పిస్తుంది. రాజు కార్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూనే యజమాని కూతురికే లైన్ వేస్తాడు. రాజుని శుక్ల ప్రేమిస్తుంది. అది తండ్రికి నచ్చదు.

లవ్ స్టోరీ నడుస్తుండగా ఊళ్ళో హత్య చేసిన రాజుని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. రాజుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.

విశ్లేషణ: హీరో ఊళ్ళో ఆవారాగా తిరగడం, ఆ తర్వాత లైఫ్ లో ఊహించని ఘటన జరగడం, అమ్మాయిని రక్షించే క్రమంలో హీరోని చూసి హీరోయిన్ ఇంప్రెస్ అవ్వడం, ప్రేమలో పడడం, ప్రేమని తండ్రి అంగీకరించకపోవడం, హీరో ఒప్పించడం.. ఇదంతా రొటీన్ రోటీ పచ్చడి కథ.

గతంతో పోలిస్తే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇలాంటి రొటీన్ కథలని ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు లేదు.

అయితే కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు స్టార్ హీరోలా ఎంత కష్టపడాలో అంతా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. కానీ రొటీన్ కంటెంట్ కారణంగా సినిమా కొంతమేరకు నిరాశపరుస్తుంది.

బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి గూస్ బంప్స్ స్టోరీలు చూసిన కళ్ళు.. మళ్ళీ ఆ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమాలు చూడాలనుకుంటాయి తప్ప రొటీన్ కథలని చూసేందుకు ఇష్టపడవు

కమర్షియల్ సినిమాతో పాటు కంటెంట్ కూడా చాలా ముఖ్యం అని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెలుసుకోలేకపోయారేమో అన్న భావన కలుగుతుంది.

అయితే రాజశేఖర్ తీసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాకి, ఈ సినిమాకి టేకింగ్ లో తేడా చూపించారు. కథకుడిగా ఫెయిల్ అయినా గానీ దర్శకుడిగా ఒక మెట్టు ఎక్కారు. రిచ్ గా, చాలా గ్రాండ్ గా తీశారు.

సుధీర్ ని ఇలా కమర్షియల్ హీరోగా, స్టార్ హీరో రేంజ్ లో ఎవరూ చూపించలేదు. ఈ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు.

డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్ లో సుధీర్ చాలా బాగా  పెర్ఫార్మ్ చేశారు.

ఇక హీరోయిన్ గెహ్నా సిప్పీ కూడా బాగానే నటించింది. సప్తగిరి,షకలక శంకర్, పృథ్వీ రాజ్ తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు.

సాంకేతిక విలువల విషయానికొస్తే.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా రిచ్ విజువల్స్ తో సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు.

ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి. ఒక్క కథే మైనస్. మంచి లైన్ పట్టుకుని ఉంటే అందరికీ పేరు వచ్చేది.

సినిమాలో సుధీర్ ఎలివేషన్ బాగుంది. కానీ కథ ఎక్స్ ట్రార్డినరీగా లేకపోవడం వల్ల ఆ ఎలివేషన్ కథను డామినేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. అల్టిమేట్ గా రొటీన్ కథ డామినేషన్ ఎక్కువవడంతో నిరాశపరుస్తుంది. 

కానీ ఒకటి చెప్పవచ్చు. ఈ సినిమా సుధీర్ కి కమర్షియల్ హీరోగా నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అయ్యింది.

ప్లస్ లు: సినిమాటోగ్రఫీ ఫైటింగ్ సీక్వెన్స్

మైనస్ లు:     కథ, కథనం

చివరి మాట: గాలోడు ఒక పక్కా కమర్షియల్ & మాస్ ఎంటర్టైనర్

గాలోడు సుధీర్ కోసం ఒకసారి చూసే సినిమా 

రేటింగ్: 2/5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)