బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో సామాన్యులకు అంతుచిక్కదు. ఈరోజు ఉన్న బంగారం ధర రేపు ఉండదు.
ఓ నాలుగు రోజులు తన ప్రతాపం చూపించి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాలుగు రోజుల తర్వాత జాలి చూపిస్తుంది. డైలీ సీరియల్ లా ఇదే కథ నడుస్తుంటుంది.
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 61,030 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం అయితే రూ. 55,940 పలుకుతోంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు చూస్తే తగ్గడంలో సిక్స్ ప్యాక్ ని, పెరగడంలో ఫ్యామిలీ ప్యాక్ ని ప్రదర్శిస్తున్నాయి.
అక్షయ తృతీయ నాటికి ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెల 22న అక్షయ తృతీయ కారణంగా అందరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ కారణంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుతూ వస్తుంది.
ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 61 వేలు దాటేయగా.. ఇటు రిటైల్ మార్కెట్లో కూడా గోల్డ్ ధర పెరుగుతూ వస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పతనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయని.. దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అమెరికా, జపాన్, జర్మనీ, చైనా, ఇటలీ, రష్యా వంటి దేశాలు డబ్బు కోసం తమ వద్ద ఉన్న బంగారం నిల్వలలో కొంత బంగారాన్ని మార్కెట్లో విక్రయించే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు.
2007లో ఇలాంటి పరిస్థితి వస్తే గ్రీస్, సైప్రస్ దేశాలు పెద్ద ఎత్తున బంగారం నిల్వలను రిటైల్ మార్కెట్లో పెట్టి విక్రయించాయని, ఆ సమయంలో బంగారం ధర భారీగా పడిపోయిందని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయని.. ఇప్పుడు పెరిగిన బంగారం భారీగా పతనమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఇది అంతర్జాలం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీని గురించి అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.