పీఎఫ్ ఖాతా ఉద్యోగులు అందరికీ ఉంటుంది. ఉద్యోగి జీతంలో నెల నెల కొంత మొత్తం ఈ పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది.

ఈ ఖాతాలన్నీ ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) అధీనంలో ఉంటాయి. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ కూడా జమ అవుతుంది.

పీఎఫ్ ఖాతా నుంచి ఉద్యోగి అత్యవసర సమయాల్లో పాక్షికంగా కొంత సొమ్మును విత్​డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది.

ఆరోగ్య సమస్యలు, ఇంటి అవసరాలు వంటి వాటి కోసం కొంత మొత్తంలో డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

అయితే ఇటీవల కాలంలో ఈ డబ్బు దోచేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులను హెచ్చరించింది.

సైబర్ నేరగాళ్లు కళ్లు ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఖాతాదారులపై పడ్డాయని.. కావున ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ సూచించింది.

ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) ఆన్‌లైన్ స్కామ్ హెచ్చరికలను విడుదల చేసింది.

ఖాతాదారులు ఎవరూ వారి యూఏఎన్ నెంబర్/ పాస్‌వర్డ్/ పాన్/ ఆధార్/ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దని ఈపీఎఫ్ఓ తెలిపింది.

ఈపీఎఫ్ఓ సిబ్బంది కూడా ఈ వివరాలను కాల్స్, మెసేజెస్, ఈ-మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎవరిని అడగరని వెల్లడించింది.

అలాగే ఫేక్ కాల్స్/మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మెసేజ్ రూపంలో వచ్చే వచ్చే ఫేక్ లింకులతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ ఖాతాదారులను సూచించింది.

అలాంటి కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే స్థానిక పోలీసు/సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.

చూశారుగా.. సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు. ఉద్యోగులూ మీరు జాగ్రత్త.