ఆయుర్వేదం ప్రకారం రోజులో ఏ సమయంలో పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది? వీటి దుష్ప్రభావాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ పాలు తాగితే శరీరానికి విలువైన పోషకాలు అందుతాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.

పాలలో కాల్షియం, ప్రొటీన్స్, పిండి పదార్ధాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

పిల్లల శరీరం అభివృద్ధి చెందడానికి అంటే టీనేజ్ లో ఎదుగుదలకు పాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే పుట్టినబిడ్డ నుంచి పెద్దల వరకు పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు.

అయితే పాలుకు సంబంధించి కూడా ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఉదయం పరగడుపున పాలు తాగడంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం.. ఉదయం పూట తేలికైన ఆహారం తీసుకోవాలని భావిస్తే కచ్చితంగా పాలు తాగడం మానేయాలి.

ఖాళీ కడుపుతో పాలు తాగితే శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందట.

ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఉదయం కంటే సాయంత్రం పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరాన్ని పునరుజ్జీవింపజేసే శక్తి పాలకు ఉంది.

ఉదయం పాలు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశముంది. సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల రాత్రి హాయిగా నిద్ర పడుతుంది.

కొన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు జీర్ణ వ్యవస్థపై ఎక్కువ భారం చూపే పాలు, ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

వీరి శరీరం పాలను జీర్ణం చేసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కడుపు నొప్పికి కారణమయ్యే సూచనలు ఉన్నాయి.

ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి, వాంతులు వంటివి వస్తాయి.

కొందరికి మిల్క్ అలర్జీ ఉన్నావాళ్లకు పాలు పడకపోవచ్చు. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకుని, వారు చెప్పిన సమయంలో తాగడం మంచిది.