వినాయక చవితి అంటే ఖచ్చితంగా పాలవెల్లి కట్టాల్సిందే. ఎందుకు కడుతున్నారో తెలియకపోయినా పూర్వం నుండి మన పూర్వీకులు కడుతున్నారు కాబట్టి కట్టాలి అనే నియమం, ఆచారం ఉంది.

అయితే ఇది ఎందుకు కడతారో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి సనాతన ధర్మంలో ఉన్న ప్రతీ పండుగ, కార్యం వెనుక సైన్స్ దాగి ఉంది. రాను రాను అదొక ఆచారంగా, సాంప్రదాయంగా మారుతూ వచ్చింది.

జ్ఞానం భగవంతుడు అయితే.. ఋషులు మన శాస్త్రవేత్తలు. భగవంతుడ్ని మించిన జ్ఞానం, ఋషులను మించిన శాస్త్రవేత్తలు లేరు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం.

పునాది లేకపోతే భవనం లేదు, పూర్వీకులు లేకపోతే నేటి తరం లేదు. అలానే మన సనాతన ఋషులు లేకపోతే నేటి శాస్త్రవేత్తలు లేరు, భగవంతుడు(జ్ఞానం) లేకపోతే విజ్ఞానం లేదు.

ఈ అనంత విశ్వంలో భూమి చిన్న అణువు మాత్రమే. ఇలాంటి అణువులు ఈ అనంత విశ్వంలో ఎన్నో ఉన్నాయి. భూమి మీద నిలబడి ఆకాశంలో చూస్తే కోటానుకోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి.

ఈ సమూహాన్ని పాలపుంత అంటారు. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాకారంలో ఒక చెక్క ఫ్రేముని లేదా లోహంతో చేసిన ఫ్రేముని కడతారు. .

గణపతిని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. సృష్టి, స్థితి, లయ ఈ మూడు స్థితుల ఫలితమే ప్రకృతి

గణపతి పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకగా సూచిస్తారు. భూమిని సృష్టిగా సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని స్థితిగా సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని లయంగా సూచించేమ్దుకు పాలవెల్లిని ఉంచుతారు.

పాలవెల్లి అంటే పాలపుంత. అందులో నక్షత్రాలని సూచించేందుకు గణపతికి ఇష్టమైన వెలగపండ్లు, మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామకాయలు, దానిమ్మ, యాపిల్ ఇలా రకరకాల పండ్లను కడతారు.

రాజులకి, ప్రముఖులకి గొడుగు పట్టడం అనేది సర్వ సాధారణమే. మరి సమస్త ప్రపంచానికి అధిపతి అయిన గణపతికి ఛత్రం పట్టాలంటే అది ఆకాశంలో ఉన్న పాలపుంత అయి ఉండాలి.

దానికి సంకేతమే ఈ పాలవెల్లి. సర్వం వ్యాపించి ఉన్న గణపతికి గొడుగు పట్టాలంటే అనంతమైన ఆకాశము, ఆ ఆకాశంలో అనంతమైన పాలపుంత ఉండాల్సిందే.

ఆ విధంగా మట్టి గణపతి పైన పాలవెల్లిని గొడుగుగా వేలాడదీస్తారు. ఇదే ఆనవాయితీగా వస్తుంది.

ఇలా ప్రతీ పూజ, ప్రతీ కార్యం వెనుక ఒక శాస్త్రం నిండి ఉంది. ఈ పాలవెల్లి వెనుక ఖగోళ శాస్త్రం ఉంది. 

పెద్దలు శాస్త్రాన్ని వదిలేసి, సాంప్రదాయాన్ని పట్టుకోవడం వల్ల కొన్ని తరాలు సనాతన ధర్మం అనే చెట్టు వేరుని పట్టించుకోలేదు.

ఇప్పటికైనా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడమే మనిషిగా మన కర్తవ్యం. మరి పాలవెల్లి ఎందుకు కడతారో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలిసింది కదా.