ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సంవర్ధినీ న్యాస్ ఓ విభిన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు, భావితరాలకు అందించడం కోసం సంవర్ధినీ న్యాస్ నడుం బిగించింది.
గర్బిణుల కడుపులో ఉన్న సంతానానికి భారతీయ సంస్కృతీ, విలువలను నేర్పేందుకు ‘గర్భ్ సంస్కార్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
మహిళల గర్భంలో ఉన్నప్పుడే శిశువులు భగవద్గీత, రామాయణ పాఠాలను ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేర్చుకుంటున్నారని సంవర్ధినీ న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే తెలిపారు.
‘గర్భ్ సంస్కార్’ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు నిపుణులు సమక్షంలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.
గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతోనూ గర్భిణులకు ట్రైనింగ్ ఇప్పిస్తారు.
ఈ కార్యక్రమం గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
గీతా శ్లోకాలు, రామాయణ చౌపాయిలను పఠించడం ద్వారా గర్భంలో ఉన్న శిశువు 500 పదాల వరకు నేర్చుకోగలరని మాధురీ మరాఠే చెప్పారు.
ఈ ప్రచారంలో భాగంగా ఇటీవల ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
న్యాస్ నిర్వహించిన ‘గర్భ్ సంస్కార్’ కార్యక్రమానికి ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరయ్యారు.
1000 మంది గర్భిణులను తొలుత ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయబోతున్నామని న్యాస్ నిర్వాహకులు తెలిపారు.
మహా భారతంలోని అభిమన్యుడి కథ ఆధారంగా ‘గర్భ్ సంస్కార్’ ప్రచారాన్ని రూపొందించారని అంటున్నారు.