మాతృత్వం మహిళలకు దేవుడిచ్చిన వరం. ప్రతి మహిళ గర్భం దాల్చి.. నవమాసాలు బిడ్డను మోసి జన్మనివ్వాలని ఆరాటపడుతుంది.
గర్భం దాల్చినట్లు తెలియగానే సంతోషంతో పొంగిపోతుంది. రాబోయో చిన్నారి కోసం ఎన్నో కలలు కంటుంది.
అన్ని రోజులు తన గురించి తాను పట్టించుకోని మహిళ గర్భం దాల్చగానే కడుపులోని బిడ్డ కోసం ఆలోచించడం మొదలు పెడతారు.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. బిడ్డకు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందిస్తారు.
అయితే బిడ్డను కడుపులో మోసే క్రమంలో ఎక్కువగా స్త్రీలు ఆందోళనకు గురౌతూ ఉంటారని వైద్యులు తెలుపుతున్నారు.
ఫలితంగా.. బిడ్డ పుట్టాల్సిన సమయం కన్నా.. ముందుగానే అంటే... ప్రీ మెచ్యూర్ డెలివరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భం దాల్చిన మహిళల్లో.. ప్రతి నలుగురిలో ఒకరికి వైద్యపరంగా ఆందోళన లక్షణాలు పెరుగుతున్నాయని పరిశోధనలో తేలింది.
ఇక ఇలా ఆందోళన పడటం వల్ల.. ముందస్తు జననానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
తాజాగా హెల్తీ బేబీస్ బిఫోర్ బర్త్ స్టడీలో భాగంగా లాస్ ఏంజిల్స్‌లో 196 మంది గర్భిణీ స్త్రీల విభిన్న నమూనాలనకు సంబంధించిన డేటాను పరిశోధకులు పరిశీలించారు.
దీనిలో భాగంగా పరిశోధకులు.. గర్భం దాల్చిన మహిళలకు మొదటి, మూడవ ట్రెమిస్టర్‌లో.. మరికొందరు మహిళలకు నాలుగు వేర్వేరు రకాలుగా ఆందోళన కలిగించారట.
ఎక్కువ మంది మూడో ట్రెమిస్టర్‌లో.. అది కూడా గర్భానికి సంబంధించిన ప్రశ్నలు అడిగిన సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు.
అయితే మొదటి ట్రెమిస్టర్‌లో మహిళల్లో ఆందోళన కాస్త తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అయితే మొదటి, మూడో ట్రెమిస్టర్‌లో ఎప్పుడు ఆందోళనకు గురైనా... ముందస్తు ప్రసవాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
గర్భం ధరించిన మొదట్లో.. సాధారణ ఆందోళన, వైద్యపరమైన ప్రమాదాలు, శిశువు, ప్రసవం, సంతాన సాఫల్యం వంటి సమస్యల గురించి ఆలోచించడం వల్ల ఆందోళన పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
మహిళలల్లో సాధారణ సమయాల్లో.. డిప్రెషన్‌ను పరీక్షించినట్లుగానే.. గర్భధారణ ప్రారంభంలో కూడా ఆందోళనను గుర్తించడానికి వైద్యులు పరీక్షలు చేయాలని అధ్యయనాలు చెబుతున్నాయి