భగవంతుడే మానవ అవతారం ఎత్తి మనిషిగా ఎలా బతకాలో నేర్పించిన పురుషోత్తముడు, మర్యాద రాముడు, మహానుభావుడు అయిన శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు ఈరోజు.

మరి అలాంటి రాముడి ఆశీస్సులు పొందాలంటే, జీవితం సంతోషంగా సాగాలి అంటే ఈ శ్రీరామనవమి రోజున ఇలా చేయాలని పండితులు చెబుతున్నారు.  

శ్రీరామనవమి రోజున నిష్టగా పూజ చేసిన వారికి ఏడాది మొత్తం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

రామాయణంలోని శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది. పుత్రకామేష్టి యాగంకు సంబంధించిన ఘట్టాన్ని చదవడం వల్ల సంతానం లేని వారికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.

సీతారాముల కళ్యాణం చూడడం, కళ్యాణ మంత్రాలు వినడం మంచిది.

కళ్యాణ సమయంలో తలంబ్రాలు పోయడాన్ని ఎవరైతే చూస్తారో వారికి ఆహారానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. 

రాముల వారి చిత్ర పటానికి గంధం, బొట్టు పెట్టి పూలు సమర్పించి.. రామ రక్షా స్తోత్రం చదివితే ఆ రాముడి రక్ష మనపై ఉంటుంది. అలానే రామ నామం జపిస్తే అంతా మంచే జరుగుతుంది.

రాముల వారిని తులసీదళాలతో, సీతమ్మ వారిని మారేడు ఆకులతో, హనుమంతుల వారిని తమలపాకులతో పూజించడం వల్ల ఏడాది మొత్తం శుభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

ఆదర్శ దంపతులు అంటేనే సీతారాములు. ఈ ఒక్కరోజు భార్యాభర్తలు ప్రశాంతంగా ఉంటే మంచి జరుగుతుంది.

సీతారాముల కళ్యాణ సమయంలో వాడే తలంబ్రాలను.. ఎవరి పెళ్లి సమయంలో అయినా తలంబ్రాలతో కలిపితే ఆ నూతన దంపతుల దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది.

శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండడం వల్ల సంతోషం, శ్రేయస్సు కలగడమే గాక చేసిన పాపాలు తొలగిపోతాయి.

ఆ రాముల వారికి హనుమంతుడు అతి పెద్ద భక్తుడు. ఈరోజున హనుమాన్ చాలీసా పఠించడం, లేనివారికి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది.

రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తే మంచిదని భావిస్తారు.

దశమి తిథి వరకూ 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగిస్తే శుభం చేకూరుతుంది. సమస్యలు ఏమైనా ఉంటే పండుగ ముగిసేవరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించాలి.

ఇక సీతారాములు జీవించినట్టు అణువంత అయినా పవిత్రంగా జీవిస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

మనిషి తన వంతు ప్రయత్నంగా పవిత్రంగా జీవిస్తూ.. ప్రయత్నాలు చేసుకుంటూ పొతే రాముడి ఆశీస్సులు తోడై జీవితం ఆనందమయమవుతుంది.

పవిత్రమైన మనసు కోసం, పవిత్రమైన ఆలోచనల కోసం, ఏకాగ్రత కోసం శ్రీరామనవమి రోజున మాత్రమే కాకుండా నిత్యం రామ నామం జపించాలి.

శ్రీరామనవమి శుభాకాంక్షలు