విశ్వక్ సేన్ అంటే యంగ్ బ్లడ్, మాస్ ఎలిమెంట్స్, వీటికి తోడు విభిన్నమైన కథలు పట్టుకుని వస్తున్నారన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది.

ఫలక్ నుమా దాస్ లాంటి మాస్ యాటిట్యూడ్ సినిమాతో అలరించిన విశ్వక్.. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అలాంటి తరహా సినిమాతో మన ముందుకు వచ్చారు.

విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలైంది.

మరి ఈ కొత్త సంవత్సరాన దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ కి శుభారంభం పలికిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథ: కృష్ణదాస్ (విశ్వక్ సేన్ 1) ఒక మధ్యతరగతి వ్యక్తి. మహేష్ (రంగస్థలం మహేష్), ఆది (హైపర్ ఆది) తప్ప ఇక ఎవరూ లేరు.

ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు కృష్ణదాస్. అనుకోకుండా కృష్ణదాస్ జీవితంలోకి కీర్తి (నివేదా పేతురాజ్) వస్తుంది. మస్తు డిస్టర్బ్ చేసి ప్రేమలో పడేస్తుంది.

కృష్ణదాస్ చేసిన తప్పుల వల్ల ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయి రోడ్డున పడ్డ కృష్ణదాస్ కి రావు రమేష్ సహాయం చేస్తాడు.

తమ ఇంటికి తీసుకెళ్లి డాక్టర్ సంజయ్ రుద్రలా (విశ్వక్ సేన్ 2) ఉండమని అంటాడు. సంజయ్ రుద్ర ఫార్మా కంపెనీ సీఈఓ. ఒక యాక్సిడెంట్ లో కృష్ణదాస్ వల్ల చనిపోతాడు.     

క్యాన్సర్ కి మెడిసన్ ను కనిపెట్టానని ఒక బిజినెస్ మేన్ (అజయ్) దగ్గర 10 వేల కోట్లకు డీల్ కుదుర్చుకుంటాడు. 

మెడిసన్ ను సకాలంలో తయారుచేయకపోవడంతో బిజినెస్ మేన్ ఫార్మా కంపెనీని, సంజయ్ రుద్ర ఆస్తులను లాగేసుకోవాలని అనుకుంటాడు.

కృష్ణదాస్ సంజయ్ రుద్రలా నటిస్తూ సంజయ్ రుద్ర కుటుంబానికి అండగా నిలబడతాడు. కట్ చేస్తే సంజయ్ రుద్ర కారు తిరిగి వస్తాడు. అప్పుడే సంజయ్ రుద్ర విలన్ అని తెలుస్తుంది.  

కృష్ణదాస్ ను 10 వేల కోట్ల స్కాంలో ఇరికిస్తారు. ఈ స్కాం నుంచి కృష్ణదాస్ ఎలా బయటపడ్డాడు? స్కాంలో ఇన్వాల్వ్ అయి ఉన్న సంజయ్ రుద్రను పోలీసులకు ఎలా పట్టించాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్ ఎక్కడో చూసామే అనిపించినట్టు ఉంటుంది కానీ దాని తర్వాత వచ్చే సీన్ మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది.

ట్విస్ట్ లకు కొదవ లేదు. యాక్షన్ ఎలిమెంట్స్ కి ఢోకా లేదు. నవ్వుకున్నవాళ్ళకి నవ్వుకున్నంత హాస్యం ఉంది. హైపర్ ఆది, మహేష్ ల కామెడీ.. ముఖ్యంగా హైపర్ ఆది పంచులు కడుపుబ్బా నవ్విస్తాయి.

ఇంటర్వెల్ ట్విస్టులు, అప్పటివరకూ మంచిగా కనిపించిన పాత్రల యొక్క అసలు స్వరూపాలు బయటపడడం వంటివి థ్రిల్ కి గురి చేస్తాయి.

నివేదా, విశ్వక్ సేన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చూసుకుని సర్దుకుపోయే మిడిల్ క్లాస్ పర్సన్ ని గెలికితే అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఈ సినిమాలో బాగా చూపించారు.

ఫస్ట్ హాఫ్ కామెడీ, ట్విస్టులు, హీరో, హీరోయిన్ రొమాన్స్, యాక్షన్ ఎపిసోడ్ ఫుల్ ప్యాక్ తో సాగితే.. సెకండాఫ్ దానికి డబుల్ ప్యాక్ లా ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ అంతా ఆయా పాత్రలను నమ్మేలా చేసి.. ఒక నిర్ణయానికి వచ్చిన మనకు.. సెకండాఫ్ లో ఆ పాత్రల నెగిటివ్ యాంగిల్ ని బయటపెట్టి ట్విస్ట్ ఇస్తారు.

ఒకేలా ఉండే ఇద్దరిలో ఒకడు చేసిన తప్పుకి.. తనలా ఉండే మరొక వ్యక్తిని ఇరికించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మంచోడికి, చెడ్డోడికి జరిగిన యుద్ధమే ఈ దాస్ కా ధమ్కీ.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లే అనుకుంటే, సెకండాఫ్ లో, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు ఒక రేంజ్ లో ఉంటాయి. మొత్తానికి విశ్వక్ సేన్ ఈ కొత్త సంవత్సరాన సాలిడ్ హిట్ అయితే అందుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు: లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకి హైలైట్. నేపథ్య సంగీతం ఈ సినిమాలోని సన్నివేశాలను అలా పైన నిలబెట్టింది.

దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. విశ్వక్ సేన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను చాలా రిచ్ గా ఉంటుంది.

నటీనటుల పనితీరు: మొదటిసారిగా విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేశారు. హీరోగా, విలన్ గా వన్ మేన్ షో చేశారు. 

నివేదా పేతురాజ్ గ్లామర్ సినిమాకి కలిసొచ్చే అంశం. వీరిద్దరి మధ్య వచ్చే ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాట మాత్రం థియేటర్ లో ఓ రేంజ్ లో ఉంటుంది.

ఇక రావు రమేష్, అజయ్, అతిథి పాత్రలో చేసిన తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేష్ లు తమ పాత్రల మేరకు చాలా బాగా నటించారు. 

ప్లస్‌లు: కథ, కథనం విశ్వక్ సేన్ నటన, దర్శకత్వం ఆది కామెడీ నేపథ్య సంగీతం

మైనస్‌లు: డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్ పోజింగ్ తప్పితే తప్పులు పట్టుకోవాలనుకున్న వారికి అవకాశం ఇవ్వకపోవడం.  

చివరి మాట: దాస్ కా ధమ్కీ.. ఇది మాస్ కా ధమ్కీ.. మిడిల్ క్లాస్ కా ధమ్కీ.. నిశ్చింతగా తీసుకోవచ్చు.   

రేటింగ్: 3/5

గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే