ఈ మధ్యకాలంలో మనిషిలో మానసిక స్థైర్యం అనేది కొరవడింది. చాలా మంది తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పెద్దవిగా చూసి భయపడిపోతుంటారు.

ఆ సమస్యకు చావే పరిష్కారంగా భావించి..అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మించి మోసం చేయడంతో మరికొందరు తీవ్ర మనస్తాపం చెంది.. ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.

అలానే ఓ ప్రైవేటు సంస్థను నమ్మి.. ఓ వ్యక్తి భారీ మొత్తంలో అప్పు చేశాడు. చివరకు వారు మోసం చేయడంతో .. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అయితే ఆయన అంత్యక్రియల దృశ్యం స్థానికలను కంటతడి పెట్టించింది. కారణం.. మృతుడి కుమార్తెలె ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన  వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామానికి చెందిన శంకుల బాల సుబ్రహ్మణ్యం రెడ్డి(46) చిన్నపాటి కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.

ఆయనకు భార్య శారద, ఇద్దరు కుమార్తెలు తేజ, లిఖిత ఉన్నారు. కుమార్తెల ఉన్నత చదువుల కోసమని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వెళ్లి.. అక్కడ నివాసం ఉంటున్నాడు.

అక్కడే ఓ సంస్థలో సబ్ కాంట్రాక్టర్ గా బాల సుబ్రహ్మణ్యం రెడ్డి పని చేసేవారు. ఈక్రమంలోనే ఆయనకు నాగాలాండ్ లో ఒక పనిని కుదిరింది.

సుమారు రూ.12 కోట్లు అప్పు చేసి ఆ పనులను పూర్తి చేశాడు. అయితే ఈ పనికి సంబంధించి బిల్లులు రావాల్సి ఉన్నాయి.

సదరు సంస్థ రూ.4.03 కోట్లను చెల్లించి..మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు.

తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆయన సంస్థను చాలా సార్లు కోరాడు. అయితే సుబ్రహ్మణ్యం రెడ్డికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేశారు.

సెప్టెంబర్ లో నాగాలాండ్ నుంచి హైదరాబాద్ కు రాగా.. ఇంటి వద్ద ఆయనకు అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో తిరిగి నాగాలాండ్ వెళ్లిపోయాడు.

ఈ క్రమంలోనే డిసెంబర్ 8న ఆయన ఉంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాద్ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు.

తనను మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి రాసిన సూసైడ్ లేఖ అక్కడ లభించింది.

నాగాలాండ్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి మరణవార్తలో కుమార్తెలు తల్లడిల్లిపోయారు.

సుబ్రహ్మణ్యం రెడ్డి మృతితో చౌకచెర్లలో విషాదఛాయాలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం బంధువుల సాయంతో మృతుడి కుమార్తెలు అంత్యక్రియలను నిర్వహించారు.

ఇద్దరు కూతుళ్లు కొడుకులుగా మారి.. తండ్రికి తలకొరివి పెట్టారు.

ఈ హృదయ విషాదకర దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.