మగవారితో పోల్చితే.. మహిళలకు అనారోగ్య సమస్యలు కాస్త ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం.. తమ గురించి తాము పట్టించుకోకపోవడం.

మరీ ముఖ్యంగా భోజనం విషయాలో ఆడవాళ్లు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఇంట్లో అందరూ తింటే చాలాని.. వారు మాత్రం.. ఏదో ఒకదానితో అడ్జెస్ట్‌ అవుతారు.

ఫలితంగా మహిళల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందకుండా పోతున్నాయి.

ఇలా పోషకాలు లోపిస్తే.. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. 

సాధారణంగా ఆడవారిలో తరచుగా కనిపించే.. ఎముకల నొప్పి, అలసట, వేళ్ల జలదరింపు, మగత, కండరాల బలహీనత వంటివి పోషకాల లోపం వల్ల కలిగే ప్రధాన సమస్యలు.

వీటిని చిన్న సమస్యలుగా భావించి.. వదిలేస్తే.. దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.

అందుకే  మహిళలు తాము తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి.

ఐరన్‌ లోపం మగాళ్లతో పోల్చితే.. ఆడవారిలోనే ఐరన్‌ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మహిళల్లో ప్రతి నెల రక్తస్రావం, రుతుస్రావం కారణంగా ఇది తలెత్తుతుంది.

దీన్ని పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తే.. రక్తహీనత సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో ఇనుము స్థాయిలు తక్కువగా ఉండేందుకు కారణమవుతుంది.

ఐరన్‌ లోపం వల్ల విపరీతమైన అలసట, నాలుక నొప్పి, మైకం, శ్వాస సరిగా ఆడకపోవడం, గోర్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇక శరీరంలో ఐరన్‌ స్థాయిలు పెరగాలంటే మహిళలు..  బీన్స్, సీ ఫుడ్, బఠాణీలు, ముదురు ఆకుకూరలు, ఎర్రమాంసం,  తృణధాన్యాలు,ఎండుద్రాక్ష, ఆఫ్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

కాల్షియం లోపం మనిషికి కావాల్సిన మరో ముఖ్యమైన ఖనిజం కాల్షియం. ఇదిఎముకలను, దంతాలను ఆరోగ్యంగా నిర్మించడానికి సహాయపడుతుంది. ఒక వేళ కాల్షియం లోపిస్తే బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా వెలువరించిన పలు నివేదికల ప్రకారం.. కాల్షియం లోపంతో బాధపడుతున్న వారిలో 8-19 ఏళ్ల మధ్యనున్న బాలికలు, 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఆడవారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు

కాల్షియం లోపించడం వల్ల వీరిలో దంతాల సమస్యలు, ఎముకలు బలహీనంగా మారడం, హృదయ స్పందన సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఈ లోపాన్ని అధిగమించాలంటే.. పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, సాల్మాన్, తృణధాన్యాలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఫోలేట్ లోపం విటమిన్ బి9 నే ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇక ఫోలేట్ అనేది మనిషి శరీరంలోని రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే అతి ముఖ్యమైన పోషకం. 

ఇది ఆరోగ్యకరమైన కణాల పెరగుదలకు, వాటి పనితీరును మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది. గర్భిణులకు ఇది అత్యంత ముఖ్యమైన పోషకం. ఇది పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే ఫోలేట్ లోపం వల్ల విపరీతమైన అలసట కలుగడమే కాక.. శ్వాస సరిగా ఆడకపోవడం, మైకం, పాలిపోయిన చర్మం, బద్దకం, గుండె దడ వంటి సమస్యలు తలెత్తుతాయి

ఈ లోపాన్ని అధిగమించాలంటే.. ముదురు ఆకు కూరలు, ఫీఫుడ్, కాయలు, పండ్లు, బీన్స్, విత్తనాలు, తృణధాన్యాలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

అయోడిన్ లోపం థైరాయిడ్ పనితీరు బాగుండటానికి, థైరాయిడ్ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కావాడానికి మన శరీరానికి కావాల్సిన మరొక ముఖ్యమైన ఖనిజం అయోడిన్. 

అయోడిన్‌ అనేది మన శరీరంలో జీవక్రియను నిర్వహించడానికి, నియంత్రించడానికి సహాయపడటమే కాక.. వివిధ శరీరక విధులను కూడా ఇది తనిఖీ చేస్తుంది.

శరీరంలో అయోడిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి క్రమరహితంగా పెరుగుతుంది. దీనినే గాయిటర్ వ్యాధి అని కూడా అంటారు. 

అయోడిన్‌ లోపిస్తే.. తరచుగా బలహీనంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, అలసట, చలిగా అనిపించడమే కాక.. బరువు కూడా పెరుగుతారు. 

ఇక గుడ్లు, సీఫుడ్, పాడి, సెల్ఫిష్, ఉప్పు, చికెన్ వంటి ఆహారాల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

విటమిన్ డి శరీరం ఆరోగ్యంగా పనిచేయడానినకి, ఎముకల పెరుగుదలకు విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా సంగ్రహించవచ్చు.

విటమిన్ డి లోపించడం వల్ల మనలో వెన్ను నొప్పి, గాయాలు త్వరగా మానకపోవడం, అలసట, నిరాశ వంటి లక్షణాలతో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

విటమిన్ డి సూర్య రశ్మిద్వారానే కాక కొవ్వు చేపలు, గుడ్డులోని పచ్చసొన, చేప కాలెయ నూనెలు, పుట్టగొడుగులు, క్యాన్డ్ ట్యూనా, సార్డినెస్, సాల్మాన్ వంటి ఆహారాల ద్వారా కూడా లభ్యమవుతుంది.

విటమిన్ బి12 మన శరీరానికి కావాల్సిని అతి ముఖ్యమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మన శరీరం సహజంగా ఉత్పత్తి చేయలేదు.

ఇది లోపిస్తే... చర్మం లేత పసుపు రంగులోకి మారడం, నిరాశ, చిరాకు, నడిచే విధానంలో మార్పులు, నోటి పూత, గొంతు, ఎరుపు రంగు నాలుక, కంటి చూపు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

పాలు, పెరుగు, గుడ్లు, ఎర్రమాంసం, కొవ్వు చేపలు, తృణధాన్యాల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.