ప్రేమ కోసం పడరాని పాట్లు పడుతుంటారు ప్రేమికులు. తమ కలల రాణి ప్రసన్నం కోసం ఆమె చుట్టూనే తిరుగుతుంటారు

ఇక అమ్మాయి ఓకే అంటే చాలు.. ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంటుంది. 

షికార్లు, సినిమాలు, పార్కులు,  చిట్  చాట్లకు కొదవ ఉండదు. అంత వరకు ఓకే కానీ.. తేడా కొడితే.

ప్రేమ బ్రేకప్‌కు చేరుతుంది.  ఇద్దరి సమ్మతితో బ్రేకప్ జరిగితే పెద్దగా బాధ ఉండకపోవచ్చును కానీ.. కేవలం ప్రియురాలు చెబితే ఆ ప్రియుడి వేదన వర్ణనాతీతం

ప్రియురాలిని మర్చిపోలేక.. మరో దేవదాసులా మారిపోతుంటాడు. లేదంటే అఘాయిత్యాలకు పాల్పడతాడు. 

కానీ మనం చెప్పుకునే ప్రేమికుడు కాస్త డిఫరెంట్. బ్రేకప్ చెప్పిన యువతిని తిరిగి పొందేందుకు పెద్ద రిస్కే చేశాడు.

ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రేమికుడు ఏకంగా 21 గంటల పాటు వర్షంలో తడిశాడు.

ఈ ఘటన  చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జరిగింది. కొన్ని రోజుల క్రితం ప్రేయసి బ్రేకప్ చెప్పడంతో జీర్ణించుకోలేకపోయాడు ప్రేమికుడు. 

గత నెల 28న దౌజాలోని తన ప్రేయసి ఇంటి వద్దకు పూల బొకేతో వెళ్లిన అతగాడు.. తన ప్రేమను తిరిగి అంగీకరించాలని కోరాడు. 

ఇంటి బయటే మోకాళ్లపై మోకరిల్లి ప్రార్థిస్తూ.. తిరిగి తనను జీవితంలోకి ఆహ్వానించాలని వేడుకున్నాడు.

సుమారు 21 గంటల పాటు వర్షంలో నానుతూ.. చలికి వణుకుతూ.. తన మాజీ ప్రేయసి మనసు కరిగించేందుకు ప్రయత్నించాడు. 

అయితే ఆమె హృదయం కరగలేదు.  అతడి ప్రేమను చూసి చలించిపోయారు చుట్టూ ప్రక్కలవారు. 

అతడిని ఆరా తీయగా..కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, తనను క్షమించాలని కోరుతున్నానని చెప్పాడు. 

ఇంత చేసినా ప్రేయసి  రావడం లేదని.. తన ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. అయినా వినిపించుకోలేదు ఆ ప్రేమికుడు.  

పోలీసులు వచ్చి చెప్పి చూసినా ససేమీరా అన్నాడు. మోకరిల్లడం చట్ట విరుద్ధమా... అంటూ తనను ఒంటరిగా వదిలేయాలని కోరాడు.  

ఎంతకు అతడి ప్రేయసి రాకపోవడంతో చలికి తట్టుకోలేక ఇక వెనుదిరిగాడు. ఈ ప్రేమ వ్యవహారం వెంటనే నెటింట్లో వైరల్‌గా మారింది.