ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య.. అధిక బరువు.

మారుతున్న జీవన శైలి, పని వేళల్లో మార్పుల ఫలితంగా ఎప్పుడు తింటున్నామో.. ఏం తింటున్నామో అర్థం కాకుండా పోతుంది.

ఫలితంగా అధిక బరువు సమస్య తలెత్తుతుంది. ఇక వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలా మంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

అందులో ఒకటి నీటి ఉపవాసం. మరి నిజంగానే దీని వల్ల ప్రయోజనాలున్నాయా.. ఇలా చేయడం సరైన పద్దతేనా అంటే..

మనకు నీరు చాలా అవసరం.  రోజు తగిన మోతాదులో నీరు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

నీరు శరీరాన్ని తేమగా ఉంచడమే కాక.. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గేందుకు నీటి ఉపవాసాన్ని ఆచరిస్తున్నారు.

నీటి ఉపవాసం.. అంటే కొన్ని రోజుల పాటు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం ఒక్క నీటిని మాత్రమే తాగుతారన్న మాట.

దీనివల్ల.. గుండె జబ్బులు, డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తప్పుతుంది అంటున్నారు నిపుణులు.

అయితే దీన్ని ఒక నిర్ధిష్ట సమయం వరకు మాత్రమే పాటించాలి. అంటే 24 నుంచి 72 గంటల వరకు మాత్రమే నీటి ఉపవాసం పాటించాలి అంటున్నారు నిపుణులు.

వైద్యులు పర్యవేక్షణ లేకుండా ఇంతకంటే ఎక్కువ సమయం నీటి ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. 

గత ఏడాది యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 8 రోజుల పాటు.. 12 మంది మధ్యవయస్కుల మీద ఈ నీటి ఉపవాసం ప్రయోగాన్ని నిర్వహించారు. 

ఎనిమిది రోజుల తర్వాత వారిలో బరువు తగ్గడం, సీరం గ్లూకోజ్ గాఢత తగ్గడం, ఒత్తిడి తగ్గడం, నిర్జలీకరణం, పెరిగిన కెటోజెనిసిస్, హైపర్యూరిసెమియా, హైపోనాట్రేమియా వంటి స్థాయిలు చాలా ఎక్కువగా తగ్గాయని గుర్తించారు.

అయితే ఈ ఉపవాసం వల్ల శరీరంపై కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నాయని.. కానీ అలా అని చెప్పి ఎక్కువ కాలం ఈ ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అధ్యయనం అంచనా వేసింది. 

ఈ నీటి ఉపవాసం వల్ల ప్రతిరోజూ ఒక కిలో వరకు బరువు తగ్గడం చాలా సులువు అని కొందరు పోషకాహార నిపుణులు అంటున్నారు. 

అలా అని ఎక్కువ రోజులు నీటి ఉపవాసం ఉండటం కూడా అస్సలు మంచిది కాదు అని ముందుగానే హెచ్చరిస్తున్నారు

ఇలాంటి ప్రయోగాల బదులు.. మన శరీరానికి సరిపడా పోషకాహారం తీసుకుంటూ.. వ్యాయామం చేయడం ఉత్తమం అంటున్నారు.

నీటి ఉపవాసం వల్ల తక్షణం కలిగే ప్రయోజనాల కన్నా.. దీర్ఘకాలంలో కలిగే నష్టాలే అధికంగా ఉన్నాయి.

కనుక ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు నిపుణులు.