సాధారణంగా సముద్రంలో అలలు ఉంటే తెల్లగా, లేదంటే ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి.

చాలా మంది సముద్రం ఒడ్డున, ఇసుకలో నడుస్తూ.. తీరాన్ని తాకే అలలను చూస్తూ ఎంజాయ్‌ చేయడం కోసమే వెళ్తారు.

ఇక తాజాగా విశాఖ భీమిలి బీచ్‌లో అలలు నీలం రంగులో మెరిసిపోతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఈ నీలి అలలు వీక్షించేందుకు పర్యాటకులు, జనాలు భారీగా క్యూ కడుతున్నారు.

భీమిలి బీచ్‌ పరిధిలో.. రాత్రి సమయంలో.. నీలి రంగు అలలు పర్యాటకులను అలరిస్తున్నాయి.

కైలాసగిరి నుంచి భీమిలి వరకు సాగర తీరంలో కొన్ని రోజులుగా అలలు నీలం వర్ణంలో మెరిసిపోతూ.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ అద్భుతాన్ని సందర్శించడానికి వచ్చిన జనాలు.. ఈ అలల ఫొటోలను సోషల్‌ మీడియాలోషేర్‌ చేయడంతో.. నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే తొలుత ఇలా నీలం అలలు కనిపించినప్పుడు జనాలు, పర్యాటకులు భయపడ్డారట.

ఈ అలల గురించి అయితే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

 సాగర తీరంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందని అధికారులు చెప్పడంతో జనాలు, పర్యాటకులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అలలు ఇలా నీలి వర్ణంలో మెరిసిపోవడాన్ని బయోల్యూమినిసెన్స్‌ తరంగాలు అంటారని తెలిపారు అధికారులు.

కేరళలోని కొచ్చి సాగర తీరంలో.. జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో నీలి అలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నారు.

అయితే తూర్పు తీరంలో ఇలా నీటి అలలు కనిపించడం మాత్రం ఇదే తొలిసారి అంటున్నారు.

ఈ నీలి అలలు మరో రెండు వారాలపాటు కనిపిస్తాయని చెబుతున్నారు అధికారులు.

ఈ నీలి అలలు ఏర్పడటానికి కారణం ప్లాంక్టన్‌ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు.

ఇవి విడుదల చేసిన రసాయనాల కారణంగా నీలి కాంతి విడుదలవుతుంది.

 ఫలితంగా అలలు ఇలా నీలం రంగులో మెరుస్తుంటాయని చెబుతున్నారు.

సముద్రంలో ఆల్గే ఎక్కువగా పెరగడం వల్ల ఈ బయోల్యూమినిసెన్స్‌ వస్తాయంటున్నారు.

ఈ ఆల్గేలో జరిగే ఒక రసాయన చర్య వల్ల నీలి రంగు వస్తుందని.. ఫలితంగా అలలు ఇలా నీలం రంగులో కనిపిస్తాయి అంటున్నారు.

 అలాగే కొన్ని ఆల్గేల వల్ల బీచ్‌లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయని వెల్లడించారు.

ఇక మనదేశంలో సముద్ర తీరాల్లో ఇలా రంగురంగుల కాంతిలో మెరిసే అలలు కనిపించడం ఇదే మొదటి సారు కాదు అంటున్నారు అధికారులు.

లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, మహారాష్ట్ర, మాల్దీవులు, చెన్నై వంటి చోట్ల ఈ తరహా నీలి అలలు తరచుగా దర్శనం ఇస్తాయి.

నీలి అలల ఏర్పాటుకు కారణమైన ఈ ప్లాంక్టన్‌ సముద్ర జీవులు ఎక్కువగా అభివృద్ధి చెందితే.. అనేక ప్రమాదాలు ఏర్పడతాయి అంటున్నారు.

వీటి వల్ల సముద్ర జలాల్లో ఆక్సిజన్‌ తగ్గి..  చేపలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు అధికారులు.