నవజాత శిశువులకు ప్రతి రోజు నూనెతో మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.
చిన్నారి కండరాల పెరుగుదల, ఎముకుల బలం కోసం మసాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఎదుగుదల బాగుండటమే కాక.. స్ట్రాంగ్‌గా మారతారు.
అయితే ఇలా మసాజ్ చేయడానికి చాలా మంది బేబీ ఆయిల్స్‌ను వాడుతుంటారు. లేదంటే కొబ్బరి నూనె.
కానీ చిన్నారులకు సంప్రదాయ నూనెలతో మసాజ్ చేస్తే.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి..
ఆవనూనె.. మన దేశంలో ఇప్పటికి చాలా మంది చిన్నారులకు మసాజ్ చేయడం కోసం ఆవనూనె వాడతారు.
ఇది శిశువు ఎముకలను, కండరాలను బలోపేతం చేయడం మాత్రమే కాక.. చిన్నారుల శరీరాలను వెచ్చగా ఉంచుతుంది.
సాధారణంగా నవజాత శిశువులు న్యూమోనియా బారిన పడే అవకాశాలు అధికం.
కనుక చిన్నారులకు ఆవనూనెతో మసాజ్ చేస్తే.. అది వారిని వెచ్చగా ఉంచడమే కాక.. జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.
పైగా ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహకరిస్తాయి.
బాదం నూనె చిన్నారులకు మసాజ్ చేయడం కోసం బాదం నూనె చాలా మంచిది అంటున్నారు నిపుణులు.
దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మంతో పాటు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మం పొడిబారడం, ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ఛాన్స్ తగ్గుతుంది.
అలానే బాదం నూనె రాయడం వల్ల చిన్నారి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వారి రంగు కూడా మెరుగుపడుతుంది.
కొబ్బరి నూనె చాలా మంది చిన్నారులకు మసాజ్ చేయడానికి కొబ్బరి నూనె ఎక్కువగా వినియోగిస్తారు.
కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేస్తాయి.
అలానే కొబ్బరి నూనెలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తలకు రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మందంగా, నల్లగా పెరుగుతుంది.
ఆలివ్ ఆయిల్ చిన్నారులకు మసాజ్ చేయడానికి బెస్ట్ ఆయిల్స్‌లో మరొకటి ఆలివ్ నూనె. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల చిన్నారుల ఎముకలు బలోపేతం అవుతాయి. అలాగే పెరుగుదల బాగుంటుంది.
ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం వల్ల చిన్నారులు చురుకుగా ఉండటమే కాక.. వారి చర్మం మృదువుగా, మెత్తగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.
చిన్నారులకు ఇతర నూనెలతో అలర్జీ వంటి సమస్యలు ఉంటే.. వారికి మసాజ్ కోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
నువ్వుల నూనె చిన్నారుల శరీరానికి మసాజ్ చేయడం కోసం మరోక బెస్ట్ ఆయిల్ నువ్వుల నూనె.
ఈ నూనె కూడా ఇతర నూనెల మాదిరిగానే అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. కానీ చాలా మంది తల్లులు శిశువు మసాజ్ కోసం దీనిని ఉపయోగించరు.
ఎందుకంటే.. ఇది కాస్త జిడ్డుగా ఉండటమే కాక.. ఎక్కువగా అంటుకుంటుంది. అందుకే దీన్ని మసాజ్ కోసం ఎక్కువగా వాడరు.
కానీ నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, చిన్నారి చురుగ్గా ఉండటమే కాక.. స్ట్రాంగ్ అవుతారు.
అలానే నువ్వుల నూనె మసాజ్ వల్ల నవజాత శిశువుల్లో చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
పైన చెప్పిన ఈ ఐదు నూనెలు.. చిన్నారులకు మసాజ్ చేయడం కోసం ఉత్తమమైనవి.
అయితే వీటిల్లో ఏది వాడాలన్నా.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి అని మర్చిపోవద్దు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణులు సలహా కూడా తీసుకోండి.