ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'అవతార్ 2' థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు 160 భాషల్లో 52 వేల థియేటర్లలో రిలీజైంది.

2009లో తొలి భాగంగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు అంటే దాదాపు 13 ఏళ్ల తర్వాత 'అవతార్ 2'.. ఆడియెన్స్ ని పలకరించింది.

మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ ని మెప్పించేలా ఉందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: ఫస్ట్ పార్ట్ మొదలైన దగ్గర ఈ సీక్వెల్ స్టోరీ మొదలవుతుంది. మనుషుల్ని పండోరా నుంచి వెళ్లగొట్టిన నావి ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇక జేక్-నేతిరి ఇద్దరబ్బాయి, ఓ అమ్మాయి పుడతారు. 

ఫస్ట్ పార్ట్ లో చనిపోయిన గ్రేస్ జీనోమ్ ఆధారంగా ఓ అవతార్ ని డెవలర్ చేస్తారు. దానికి పుట్టిన కిరి అనే అమ్మాయిని జేక్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది.

ఇక హ్యాపీగా సాగిపోతున్న వీళ్ల లైఫ్ లోకి ఆర్మీ కల్నల్ మైల్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ చివర్లో చనిపోయిన అతడు అవతార్ లా రీఎంట్రీ ఇస్తాడు.

ఓ చిన్న ప్రాబ్లమ్ వల్ల జేక్-మైల్స్ మధ్య చిన్నసైజ్ గొడవ జరుగుతుంది. దీంతో ఉన్నచోట నుంచి మెట్కాయాన్ గ్రామానికి జేక్ ఫ్యామిలీ వలస వెళ్లిపోతుంది.

ఆ తర్వాత సముద్ర వాసుల్లో ఒకరిగా జేక్ ఫ్యామిలీ కలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు జేక్ ఫ్యామిలీ సేఫ్ అయ్యారా లేదా అనేది రివ్యూలో చూడాలి.

విశ్లేషణ: ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు 'అవతార్ 2' స్టోరీ చాలా నార్మల్ గా అనిపిస్తుంది. కానీ విజువల్స్ మాత్రం కేక పుట్టించి, విజిల్స్ వేసేలా డిజైన్ చేశారు.

ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండాఫ్ స్టార్ట్ అవుతుందో.. స్టోరీ చకాచకా వెళ్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఇక 'అవతార్'లో స్టార్టింగ్, ఎండింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో.. సీక్వెల్ లో కూడా దాదాపు అదే షాట్స్ ఉంటాయి. అది జేమ్స్ కామెరూన్ స్టైల్ కావొచ్చు బహుశా. రాబోయే పార్ట్స్ లోనూ దీనినే కొనసాగించే ఛాన్సుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. జేక్, నేతిరితోపాటు వాళ్ల నలుగురు పిల్లలు, ఆర్మీ కల్నల్ మైల్స్ వి కీలకమైన రోల్స్. వాళ్లు అందుకు తగ్గటే ఫెర్ఫార్మ్ చేశారు. 

టెక్నికల్ విషయాలకొస్తే.. కర్త-కర్మ-క్రియ అయిన జేమ్స్ కామెరూన్ సినిమాకు ప్లస్, ఓ రకంగా మైనస్ కూడా. సినిమాను చాలా అద్భుతంగా తీశారు.

కానీ తను తీసిన సీన్స్ పై ప్రేమతో కొన్ని అలానే ఉంచేశారు. దీంతో సినిమా కొంచెం సాగదీతగా అనిపిస్తుంది.

ఇక గ్రాఫిక్స్ టీం కూడా అద్భుతమైన వర్క్ చేశారు. ప్రతి సీన్ ఓ పెయింటింగ్ లా రావడంలో వాళ్ల కృషి కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ ని ఎలివేట్ చేశారు.

ప్లస్ పాయింట్స్:  జేమ్స్ కామెరూన్ డైరెక్షన్, అద్భుతమైన విజువల్స్, సెకండాఫ్ లో రెండు యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:  ప్రిడిక్టబుల్ స్టోరీ, సినిమా నిడివి

రేటింగ్: 3/5 (గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)