సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అర్జున్ కుమార్ అల్లం(విశ్వక్ సేన్) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 33 ఏళ్ల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదని.. ఫ్యామిలీ, చుట్టు పక్కలవారు, చుట్టాలు బంధువుల అనే మాటల పోరు పడలేకపోతాడు.
అర్జున్ కోసం ఫ్యామిలీ పెళ్లి సంబంధాలు వెతుకుతూనే ఉంటుంది. ఆఖరికి వీళ్ల కులంలో అమ్మాయి దొరకక.. వేరే కులం అయినప్పటికీ గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సర్ దిల్లాన్)ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాడు.
తీరా పెళ్లి సమయానికి కరోనా లాక్ డౌన్ పడుతుంది.. అదే టైంలో ఓ షాకింగ్ ట్విస్టు కారణంగా పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లికాని అర్జున్ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. మరి ఇంతకీ సూర్యాపేట అర్జున్ కుమార్ అల్లం పెళ్లి జరిగిందా లేదా?
పెళ్లి కోసం అర్జున్ కులం, వయసు లాంటి అడ్డంకులను ఎలా ఫేస్ చేశాడు? చివరికి అర్జున్ కుమార్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? వయసు మీదపడి పెళ్లి కాని యూత్ కి ఎలాంటి సందేశం ఇచ్చాడు? అనేది తెరమీద చూడాల్సిందే.
విశ్వక్ సేన్ అనగానే అందరూ దాదాపు మాస్ క్యారెక్టర్ ని ఊహించుకుంటారు. ఎందుకంటే విశ్వక్ సినిమాలను ప్రమోట్ చేసే విధానం, అతని మాటతీరు అలా ఉంటుంది. కానీ విశ్వక్ లోని మాస్ క్యారెక్టర్ కి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ ఈ సూర్యాపేట అర్జున్ కుమార్ అల్లం.
తనకున్న మాస్ ఇమేజ్ ని పక్కనపెట్టి పూర్తి క్లాస్ స్టోరీగా చేసిందే ఈ అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రం. 30 ఏళ్లు వయసు పైబడినా పెళ్లి చేసుకోని అబ్బాయిలు సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే పాయింట్ తో సినిమాను స్టార్ట్ చేశారు.
అర్జున్ కుమార్ అల్లంగా విశ్వక్ సేన్, పెళ్లికూతురు మాధవి పాత్రలను చాలా సింపుల్ గా, అందంగా పరిచయం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సింపుల్ గా మంచి మ్యూజిక్, కామెడీలతో కథలోకి తీసుకెళ్తారు. ముందు నుండి ఈ పెళ్లి అవుతుందో లేదో అనే భయంలో ఉన్న అర్జున్ కి ఇంటర్వెల్ టైంలో పెళ్లికూతురు ఇచ్చే షాక్ మాములుగా ఉండదు.
తెల్లారితే పెళ్లి అనే టైంలో పెళ్లి ఆగిపోతే పెళ్ళికొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు మేకర్స్. సినిమా స్టార్టింగ్ నుండి చివరి వరకు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు.
కొడుకు పెళ్లి జరిగే టైంలో పేరెంట్స్ ఎమోషన్స్, కూతురు పెళ్లి అవుతుందంటే వారి తరపు భావోద్వేగాలను రైటర్ రవికిరణ్ కోలా చాలా బాగా రాసుకున్నారు. సినిమాలో కామెడీ ఉన్నంతలో నవ్విస్తుంది.
ఇంటర్వెల్ ట్విస్టు తర్వాత.. సెకండ్ హాఫ్ లో అర్జున్ కుమార్ అల్లం అసలు కథ మొదలవుతుంది. లాక్ డౌన్ విధించిన కారణంగా పెళ్లి లేకపోయినా పెళ్లికూతురు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అక్కడినుండి సొంతూరు సూర్యాపేటకు వెళదామన్నా.. లాక్ డౌన్, ప్రభుత్వం అనుమతులు లేవు.
వీటన్నిటి మధ్య అర్జున్ కుమార్ ఫ్యామిలీకి తోడు ఇరుగుపొరుగువారి టార్చర్. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. కొన్ని పాత్రలు కాసేపే ఉన్నప్పటికీ.. అరే ఇవన్నీ మనం సహజంగా చూసేవే అనిపిస్తుంది.
ప్రతి పెళ్ళిలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ డిజైన్ చేసి.. కామెడీ క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ చక్కని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా అలా సాగిపోతుంది.
ముఖ్యంగా సినిమాలో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. విశ్వక్ సేన్ మరోసారి ఎమోషనల్ యాక్టింగ్ అదరగొట్టి ఇచ్చిపడేసిండని చెప్పాలి. అర్జున్ కుమార్ అల్లం పాత్రతో ఆకట్టుకున్నాడు. మాధవిగా హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ ఉన్నంతలో మెప్పించింది.
కానీ సినిమాలో రుక్సర్ కాకుండా మరో హీరోయిన్ రితికా నాయక్.. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ప్యాక్ అనే చెప్పాలి. పెళ్లికూతురు చెల్లి పాత్రలో సూపర్ గా నటించింది. విశ్వక్ సేన్ కి, రితికాకి మధ్య వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఫస్ట్ మూవీ అయినప్పటికీ రితికాకి మంచి రోల్ దొరికింది.
రాజావారు రాణిగారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. కథకు పూర్తి న్యాయం చేయడంలో డైరెక్టర్ విద్యాసాగర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో జయ్ క్రిష్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు.
పవి కే పవన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకు మేజర్ ప్లస్ లలో ఎడిటింగ్ ఒకటి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాలో నటించిన అందరు నటులు తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా రాణించారు.
మొత్తానికి అర్జున్ కుమార్ అల్లంగా విశ్వక్ సేన్ మెప్పించాడు. మాస్ కా దాస్.. క్లాస్ పెళ్లి భోజనం పెట్టి డీసెంట్ హిట్ అందుకున్నాడు.