మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో మత్స్యకారుని ఖాతాలో రూ. 10 వేలు జమ చేయనుంది.

వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద వరుసగా ఐదో ఏడాది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేయనుంది ఏపీ ప్రభుత్వం.

ఇప్పటికే 1,23,519 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వీరి ఖాతాల్లో రూ. 123.52 కోట్లు జమ చేయనుంది.

సముద్రంలో వేట నిషేధం ఉన్న కారణంగా ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 60 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం కొనసాగుతుంది.

సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలం ఇది. ఈ సమయంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వేట నిషేధ నిర్ణయం తీసుకుంది.

అయితే వేట మీదే ఆధారపడి జీవించే మత్స్యకారులకు 2 నెలల విరామం అంటే భారం అవుతుందన్న ఉద్దేశంతో వేట నిషేధ భృతి అందజేస్తుంది ప్రభుత్వం.

గతంలో వేట నిషేధ భృతి రూ. 4 వేలు ఉంటే.. దాన్ని ఏపీ ప్రభుత్వం రూ. 10 వేలకు పెంచింది.

ఈ నెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కడం ద్వారా మత్య్సకార భరోసా నిధులను విడుదల చేస్తారు.

ఈ పథకం కింద రూ. 10 వేలు పొందాలనుకున్న వారి వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఇక వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి రూ. 1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో ఉండే వారికి రూ. 1.44 లక్షల లోపు ఉండాలి.

అయితే ఆల్రెడీ సంక్షేమ పథకాలు పొందుతున్న వారు, మత్స్యకార పింఛన్లు పొందుతున్న వారు ఈ పథకానికి అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వ రంగ ఉద్యోగం చేస్తున్నా ఈ పథకం వర్తించదు.

3 ఎకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమి.. రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉన్న వారికి ఈ పథకం కింద రూ. 10 వేలు రావు.

అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం మించి ఇల్లు ఉన్నా, ఆదాయపన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.