తెలుగులో కుటుంబ కథా చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి.
స్టార్ డైరెక్టర్స్ దగ్గర నుంచి యువ దర్శకుల వరకు ఈ జానర్ లో సినిమాలు తీస్తుంటారు.
అలా లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తీసిన మూవీ 'అన్నీ మంచి శకునములే'. తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది.
ఇందులో వాసుకితోపాటు చాలా మంది స్టార్స్ ఉండటంతో రిలీజ్ కి ముందు అంచనాలు ఓ మాదిరిగా ఏర్పడ్డాయి.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చూసేయాల్సిందే.
కథ: ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాని గురించి రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది.
మరోవైపు రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవిక నాయర్).. ఈ ఫ్యామిల్లో ఒకే టైంలో పుడతారు. కానీ నర్సుల వల్ల తారుమారవుతారు.
అక్కడి నుంచి పెరిగి పెద్దయిన తర్వాత హీరో హీరోయిన్ మారిపోయారని తెలిసిందా లేదా చివరకు ఏమైంది?
ఈ స్టోరీలో రిషి-ఆర్య ప్రేమకథలో ఫైనల్ గా ఏం జరిగింది అనేది తెలియాంటే మీరు 'అన్నీ మంచి శకునములే' చూడాలి.
విశ్లేషణ: ఈ మూవీ స్టార్టింగ్ లో హీరోహీరోయిన్లు.. నర్సుల వల్ల కుటుంబాలు తారుమారు అవుతారు.
ఈ సీన్ చూడగానే 'అల వైకుంఠపురములో' ఇంట్రడక్షన్ సీన్ గుర్తొస్తుంది. ఇది ఒకటే కాదు ఇలా చాలా సీన్లు ఎక్కడో చూసినట్లుందనిపిస్తుంది.
సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఇలాంటి ఎన్ని కాపీ సీన్స్ ఉన్నాసరే వర్కౌట్ అయిపోతుంది. ఇందులో అసలుకే మోసం వచ్చేసింది.
ఫస్టాప్ సో సో కామెడీతో అలా నడిచిపోయింది. ఇంటర్వెల్ అయితే మమ అనిపించారు. సెకండాఫ్ అయితే చాలా ల్యాగ్ తో నడిచింది.
మూవీ మొత్తం చాలా సాదాసీదాగా నడిచిపోయింది. క్లైమాక్స్ లో ఎమోషన్స్ ని బలంగా చెప్పడానికి ట్రై చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా కొత్త పాయింట్ ని ప్రయత్నిస్తే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతుంది.
కానీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన పాయింట్ తో తీద్దామంటే కుదరదు. 'అన్నీ మంచి శకునములే' విషయంలో అదే జరిగింది.
స్క్రీన్ పై బోలెడంత మంది ఆర్టిస్టులన్నప్పటికీ.. కంటెంట్ లో డెప్త్ లేక, రైటింగ్ వీక్ గా ఉండటం వల్ల మొత్తానికే తేలిపోయింది.
నటీనటుల పనితీరు: సంతోష్ శోభన్ లో మంచి ఈజ్ కనిపించింది. సరైన కంటెంట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ పడితే దున్నేస్తాడనిపించింది.
హీరోయిన్ గా మాళవిక నాయర్ ఓకే. లుక్స్ బాగున్నాయి. అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ లో వేరే ఏ హీరోయిన్ ని పెట్టినాసరే మార్పేం ఉండదు.
రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేష్, గౌతమి, ఝూన్సీ.. ఇలా బోలెడంత మంది అద్భుతమైన ఆర్టిస్టులున్నప్పటికీ వాళ్లని సరిగా యూజ్ చేసుకోలేకపోయారు.
హీరోకి అక్కగా నటించిన వాసుకి బాగా కనిపించింది. టాలీవుడ్ లో హీరోలకు మరో కొత్త అక్క దొరికిందని చెప్పొచ్చు. ఇతర నటీనటులు పర్వాలేదనిపించారు.
టెక్నికల్ టీమ్ పనితీరు: ఈ సినిమాని ఊటీ, ఇటలీలో తీయడంతో అంతా రిచ్ గా కనిపించింది. దానికి తోడు నిర్మాణ విలువలు గట్టిగానే పెట్టారు.
సినిమాటోగ్రఫీ బాగుంది. రైటింగ్ లో ల్యాగ్ వల్ల ఎడిటింగ్ కి ఎంత పనిచెప్పినా సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
మిక్కీ జే మేయర్ పాటలు ఎక్కడో విన్నట్లు అనిపించాయి. థియేటర్ నుంచి బయటకొస్తే గుర్తుండవు. కొన్నిచోట్ల బీజీఎం ఓకే.
ప్లస్ పాయింట్స్: లీడ్ యాక్టర్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్: స్టోరీ, బోరింగ్ సీన్స్, పాటలు