అందాల పోటీలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని  లేదు.

ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న చాలా మంది స్టార్‌ హీరోయిన్లు కెరీర్‌ ఆరంభంలో అందాల పోటీల్లో పాల్గొని కిరీటాలు దక్కించుకున్నారు.

సుస్మితా సేన్‌, ఐశ్వర్య రాయ్‌, ప్రియాంక చోప్రా, నమ్రతా శిరోద్కర్‌ వంటి వారు అందాల కిరీటాలు గెలుచుకున్నారు.

ఒకప్పుడు అందాల పోటీలు అంటే నార్త్‌ వాళ్లే అన్నట్లుగా ఉండేది.

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.

కానీ ప్రస్తుతం గ్లామర్‌ ఫీల్డ్‌లో తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ్ల మిస్‌ ఇండియా కిరీటం గెలుచుకుంది.

తాజాగా మరో తెలుగు అమ్మాయి మిస్‌ ఇండియా పోటీలకు సెలక్ట్‌ అయ్యింది.

ఆమె ఏపీ అన్నమయ్య జిల్లాకు చెందిన రైతు బిడ్డ గోమతి రెడ్డి.

గోమతి తండ్రి శ్రీనివాసులరెడ్డి, తల్లి అరుణకుమారి. వీరిది వ్యవసాయ కుటుంబం.

స్కూల్లో చదివే రోజుల నుంచే గోమతి బెస్ట్‌ బేబి వంటి పోటీల్లో పాల్గొనేది.

చిన్నప్పటి నుంచి  కుమార్తె ఆసక్తిని గమనించిన గోమతి తల్లిదండ్రులు ఆమెను ఆదిశగా ప్రోత్సాహించారు.

గోమతి డిగ్రీ చదువుతుండగా.. కాలేజీలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు బెంగళూరులో నిర్వహించిన సౌత్‌ ఇండియన్‌ మిస్‌ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.

ఇక ఈ ఏడాది జనవరి 25న ముంబైలో నిర్వహించిన ఫెమినా మిస్‌ ఆంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుంది గోమతి.

దాంతో ఈ ఏడాది నిర్వహించే మిస్‌ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకుంది గోమతి.

ఇక 2023, మార్చి 5న జరిగే మిస్‌ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున పాల్గొననుంది గోమతి.

మిస్‌ ఇండియా కిరీటం గెలిచి.. ఆ తర్వాత మిస్‌ వరల్డ్‌ కిరీటం సాధించడమే తన లక్ష్యం అంటుంది గోమతి.

ప్రసుత్తం ఆమె బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా ఉద్యోగం చేస్తోంది.