హ్యాట్సాఫ్! చిన్నారుల ఆకలి తీర్చిన పోలీస్ అన్న! వీడియో వైరల్!

మానవ సేవే మాధవ సేవ అంటారు. సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవాల్సింది మనిషేగా. తాజాగా ఇలాగే ఓ ట్రాఫిక్ పోలీస్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా మనలో చాలా మందికి పోలీసులు అంటే కాస్త భయం ఉంటుంది. వారు చాలా కఠినంగా ఉంటారు. తప్పు లేకపోయినా ఏదో ఒక నెపంతో తిడుతుంటారని చెడు అభిప్రాయంతో ఉంటాము. ఇందుకే వారి దగ్గరికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. కానీ.., ఇదంతా నిజం కాదు. అందరు పోలీసులు అలా ఉండరు. ముఖ్యంగా మన భాగ్యనగర పోలీసులు అలాంటి వారు కాదు. విధి నిర్వహణలో హైదరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. నేరస్థుల తాట తీయడంలోనే కాదు, కష్టం వచ్చిన వారికి అండగా నిలవడంలో వారు ఎప్పుడు ముందుంటారు. తాజాగా మరో ట్రాఫిక్ పోలీస్ ఈ విషయాన్ని నిజం చేసి చూపించాడు. నిజమైన పోలీస్ అనే పదానికి చిరునామాగా నిలిచాడు. కరోనా కష్టకాలంలో పోలీసులు ఫ్రంట్ వారియర్స్గా మారిన విషయం తెలిసిందే. వీరంతా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక లాక్డౌన్ పెట్టినప్పటి నుండి ఆకలి దప్పికలు భరిస్తూనే పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్మహేశ్ కూడా ఇలానే డ్యూటీ చేస్తున్నాడు. కానీ.., డ్యూటీ సమయంలో మహేష్ చేసిన ఓ మంచి పని ఇప్పుడు అతన్ని రియల్ హీరోగా మార్చేసింది.

mahesh 2

లాక్డౌన్ విధుల్లో భాగంగా అతను సోమాజిగూడలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇంతలో ఇద్దరు చిన్నారులు రోడ్ పైకి వచ్చారు. లాక్ డౌన్ సమయంలో వీరిని తల్లిదండ్రలు ఇలా ఎందుకు వదిలేశారు అనుకున్నాడు. కానీ.., చౌరస్తాలో నిలబడి తమ ఆకలి తీర్చమంటూ దీనంగా వాహనదారులను అడుక్కోవడం ప్రారంభించారు పిల్లలు. వారిని చూసి చలించిపోయాడు పోలీస్. లాక్డౌన్ సమయంలో బయటికి ఎవరూ రాకపోవడంతో.., చిన్నారుల ఆకలి తీర్చే వారే కరువయ్యారు. ఆ పిలల్లు అనాధలని, వారు కడుపు నిండా తిండి తిని చాలా రోజులైందని అర్ధం చేసుకున్నాడు మహేశ్. దీంతో.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేశ్ వెంటనే స్పందించాడు. పిల్లలను రోడ్డు పక్కన కూర్చోబెట్టాడు.తాను ఇంటి నుంచి తెచ్చుకున్న మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు. ఆ చిన్నారులిద్దరికీ స్వయంగా వడ్డించాడు. పాపం.. ఆ చిన్నారులు కడుపు నిండా అన్నం తిని ఎన్నిరోజులైందో..! మహేశ్ వడ్డించిన ఆహారాన్ని ఆవురావురుమంటూ తినేశారు. ఈ పరిణామంతో అప్పటి వరకు ఆకలితో ఎండిపోయిన ఆ చిన్నారుల ముఖంలో నవ్వు వచ్చింది. తమ కడుపు నింపిన పోలీస్ అంకుల్ తో ఆ చిన్నారులు సరదాగా మాటలు కలిపారు. ఈ వీడియోని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు ట్విట్టర్ లో షేర్ చేశాడు. మంచి మనసుతో పిల్లల ఆకలి తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేష్ కి అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. మీరు కూడా ఈ మంచి పోలీస్ అన్నని కామెంట్స్ రూపంలో అభినందించండి .