
ఉక్కపోతను పోగొట్టుకునేందుకు మనం ఫ్యాన్ లేదా ఏసీలను వేసుకుంటాం. అదే ప్రయాణ సమయంలో వాహనంలో మన పక్కనున్న కిటికీ అద్దాలను తెరుచుకుంటాం. అయితే విమానంలో కిటికీ అద్దాలు తెరుచుకునే వీలు లేదు కాబట్టి, వారు ఉక్కపోత లేకుండా చూస్తారు. అయితే ఓ మహిళకు విమానంలో ఉక్కపోతగా ఉందని ఆమె ఏం చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు.
కివ్ విమానాశ్రయంలోని ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమానం బోయింగ్ 737లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి టర్కీ విహారయాత్రకు వెళ్తోంది. కాగా ఆమెకు విమానంలో తీవ్ర ఉక్కపోత కలగడంతో ఆమె పక్కనే ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోను తీసి విమానం రెక్కపైకి ఎక్కింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తమ తోటి ప్రయాణికురాలు ఈ విధంగా ప్రవర్తించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఎయిర్‌పోర్టు అధికారులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవగా, ఇప్పటికే ఆమె పేరును బ్లాక్‌లిస్టులో పెట్టారు.