
ఇప్పుడున్న ప్రపంచంలో మనం రోజూ కడుపులోకి ఏం పంపిస్తున్నాం? ఏమో చెప్పలేం! ఎందుకంటే, ఎక్కడ ఏం తిన్నా కలుషితమే! పాలు, పెరుగు మొదలు బియ్యం, మాంసాహారం, పళ్లు, ఆకు కూరల వరకూ అన్నీకృత్రిమంగానే మారిపోతున్నాయి. మందులు చల్లినవీ, కలుషితమైన నీటితో పండించినవి, కెమికల్స్ కలిపి అందమైన ప్యాకుల్లో మార్కెట్లోకి వదిలినవీ… ఇలా దేన్ని కదిలించి చూసినా ఆందోళనకరమైన అంశాలే! ఇక ఇలాంటి సాధారణ విషాలు కాకుండా… మన కడుపులోకి మరిన్ని విషాలు కూడా వెళ్లిపోతున్నాయి. కొందరు అతిగా మద్యం తాగేస్తుంటారు. ఇంకొందరు పొగాకు బానిసలు.
ఇక మరి కొందరైతే ఏకంగా డ్రగ్స్ కూడా వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా శరీరాన్ని విషతుల్యం చేసేస్తుంటాయి!
మద్యం, డ్రగ్స్ అంటే భయపడతాం కానీ… ఇక్కడే మరో చిక్కు కూడా వుంది. అనేక అనారోగ్యాల కారణం మనం ఈ మద్య బోలెడు టాబ్లెట్స్ వాడుతున్నాం. అల్లోపతి మందులు కూడా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తోనే వుంటాయి. యాంటి బయోటిక్ మాత్రాల వల్ల శరీరం అనేక ప్రభావాలకు లోనవుతుంటుంది. మరి ఇలాంటి హానికరమైన పదార్థాలన్నీ కడుపులో రోజుల తరబడి అలానే వుండిపోతే ఎలా? దీనికో పరిష్కారం వుంది. అదే డీ టాక్స్ టీ!
టాక్సిన్స్ అంటే ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు. ఇవి రకరకాలుగా మన ఒంట్లోకి, రక్తంలోకి చేరిపోతుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు బయటకి తోసేస్తుండాలి. అందు కోసం వ్యాయామం, ఎక్కువగా నీరు తాగటం, యోగా, ఉపవాసం వగైరా వగైరా చేస్తూ వుండాలి. అయితే, వాటితో పాటూ ఉదయం లేవగానే మొట్ట మొదటి పనిగా డీ టాక్స్ టీ తీసుకుంటే…. చాలా రకాల టాక్సిన్స్ శరీరం నుంచీ వెళ్లిపోతాయి. మన అంతర్భాగం శుద్ది అవుతుంది.
ఈ టీ తయారు చేయటానికి కావాల్సినవి… తులసీ ఆకులు, ధనియాల పొడి, పచ్చటి ఇలాచీలు, బ్లాక్ పెప్పర్, నిమ్మకాయ, తేనే. వీటితో కడుపుని పరిశుభ్రం చేసే టీ తయారు చేసుకొవచ్చు. వేడి నీళ్లలో తులసీ ఆకులు, ధనియాల పొడి, ఇలాచీలు, పెప్పర్ వేసి ఉడికించి వడ కట్టాలి. తరువాత తేనే, నిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపునే తీసుకోవాలి. ఉదయం లేవగానే మరేదీ తాగక ముందే ఈ టీ తాగేయాలి. దాని వల్ల లోపల వున్న విషతుల్యమైన, హానికరమైన పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి.
ఈ టీ ఎవ్వరైనా తాగవచ్చు. అయితే, డ్రగ్స్ అలవాటు వుండి మానేసిన వారు, ఎక్కువగా మందు తాగే వారు, రకరకాల కారణాల చేత ఎక్కువ మెడిసన్స్ వాడుతున్న వారు తప్పక అలవాటు చేసుకోవాలి. ఎంతో మేలు కలుగుతుంది!