
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మనుష్యుల మధ్య సామాజిక దూరాన్ని పెంచేసిన కరోనా ఒక్క విషయంలో మాత్రం అందరికీ మంచి చేసింది. ప్రాణానికి ముప్పు అని తెలిసి కూడా చాలా మంది సిగరెట్, బీడీ వంటి ధూమపానం చేస్తూ తమ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యానికి హాని కలిస్తున్నారు.
అయితే వారికి కరోనా వైరస్ చెక్ పెట్టిందని చెప్పాలి. పొగత్రాగే వారికి ఈ వైరస్ త్వరగా సోకుతుందని పలు సర్వేల్లో తేలింది. పొగ పీల్చినప్పుడు S-2 ఎంజైమ్‌ను ముక్కు ఎక్కువగా స్రవిస్తుందని, దాని కారణంగా కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వేగంగా చేరుతుందని WHO తెలిపింది. దీంతో పొగపీల్చే వారు దెబ్బకు ఆ అలవాటును మానేశారు. చాలా మంది ఇప్పుడు పొగపీల్చేందుకు ఇష్టపడటం లేదట. ముఖ్యంగా ఇండియాలో లాక్డౌన్ సమయంలో ఏకంగా 66 శాతం పొగత్రాగే వారి సంఖ్య తగ్గిందని ఫౌండేషన్ ఫర్ స్మోక్‌ఫ్రీ వరల్డ్ సంస్థ పేర్కొంది.
ఇటీవల చైనాలో కరోనా వచ్చిన 82 వేల మందిలో 95 శాతం పొగా రాయుళ్లే ఉన్నారని ఆ సంస్థ ప్రకటించింది. ఏదేమైనా కరోనా వైరస్ కారణంగా ఇండియాలో పొగరాయుళ్లకు చెక్ పడిందని పలువురు సంతోషిస్తున్నా, కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటం ఆందోళన కలిగించే అంశమేనని వారు అంటున్నారు.