
భారతదేశంలోని ఆలయాలను, ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసేందుకు రోజూ వందలమంది విదేశీ పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. వారు మన సంస్కృతి, సంప్రదాయాలను చూసి చాలా గర్వపడుతుంటారు. ఇక విదేశాల నుండి వచ్చే వారు చాలా మంది భారతదేశ సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులవుతుంటారు. అయితే అలాంటి అనుభూతి కోసం వచ్చిన ఓ అమెరికా అమ్మాయికి ఇక్కడి ఆధ్యాత్మికతతో పాటు చేదు అనుభవం ఎదురైంది.
అమెరికాకు చెందిన 31 ఏళ్ల యువతి భారత్లో పర్యటించేందుకు ఆరు నెలల ముందు ఇక్కడికి వచ్చింది. తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఆమె సందర్శిస్తున్న సమయంలో లాక్డౌన్ విధించడంతో ఆమె ఇక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆమె తమిళనాడులోని తిరువణ్ణామలైలోని గిరివలయం ప్రాంతంలోని అరుణాచలం రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే ఆ ప్రాంతంలో స్వామీజీలు ఎక్కువగా ఉంటుంటారు. దీంతో మణిగండన్ అనే వ్యక్తి స్వామీజీగా ఉంటూ ఆమెపై కన్నేశాడు.
అమెరికా అమ్మాయి చూడటానికి చాలా బాగుండటంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ఆశీర్వదించేందుకు వెళ్లినట్లు నటించాడు. ఒంటరిగా ఉన్న ఆ యువతిపై మణిగండన్ అత్యాచారం యత్నం చేశాడు. దీంతో ఆమె చేతికి దొరికిన కత్తితో ఆ స్వామీజీని కోసేసింది. ఆమె కేకలు వేయడంతో ఆ స్వామీజీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాగా ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టి దేహశుద్ధి చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి తోశారు. ఇలా ఓ అమెరికా అమ్మాయికి భారతదేశంలోని దొంగస్వామీజీ కారణంగా చేదు అనుభవం మిగిలింది.