
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్లైన్ ఆధారిత సేవలు పెరిగాయి. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్ నేడు పల్లెల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీనితో గడిచిన రెండుఏళ్ళలో డిజిటల్ పేమెంట్ రంగం 39 శాతం వృద్ధితో వేగంగా దూసుకుపోతుంది. దీనితో పాటు సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని పైన అవగాహనా మాత్రం శూన్యం. ఈ అమాయకత్వాన్నే సైబర్ క్రిమినల్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజలను మభ్యపెట్టి వారి నుండి డబ్బును దొగలించుకుపోతున్నారు.
సైబర్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2018 లో- 3,353 కేసులు నమోదుకాగా, నేడు అవి పది వేలకు మించి ఉన్నాయి. ప్రతిరోజూ అనేక మంది ప్రజలు ఆన్లైన్ మోసాలకు గురవుతూ, ఆర్ధిక నష్టాలకు గురవుతూ ఉన్నారు. అయితే వీటిలో చాలా వరకు బయటకు రాని విషయాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆన్ లైన్ మోసాలకు ప్రధానంగా పోర్నోగ్రఫీ వెబ్ సైట్స్, మోసపూరితమైన ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ఎక్కువ కారణాలుగా ఉన్నాయని ఎన్నో సర్వేల్లో తేలింది. అంతేకాకుండా ప్రజలుకూడా ఆఫర్ల ప్రలోభాలకు లోనై తెలియని వెబ్ సైట్స్, వ్యక్తులను ఆశ్రయించడం కూడా మరొక ప్రధాన కారణంగా ఉంది. లాక్ డౌన్ కాలంలో సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ఢిల్లీల్లోకేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. దీనితో ప్రజలు పోలీస్ స్టేషన్స్ కు వెళ్ళడానికి అధిక సమయం పడుతుంది. మరికొందరు పరువుపోతుందిఏమోనని అసలు భయటకు కూడా చెప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాడనికి కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు కేవలం ఆన్ లైన్ లో ఫిర్యాదు నమోదు చేయడమే కాదు ఆ ఫిర్యాదులకు సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అనే అంశాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది.