
అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి నిలబడలేక గజగజ వణికిపోతుంది. ప్రతిరోజు వేలల్లో నమోదవుతున్న కొత్త కేసులతో అమెరికా హాస్పిటల్స్ పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇప్పటి వరకు అమెరికాలో 4.6 మిలియన్ల మంది కరోనా బారిన పడగా, 1,55,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు మరింత భయంకర పరిస్థితులు ఎదుర్కొంటుంది. తాజా సమాచారం ప్రకారం అగ్రరాజ్యంలో కరోనా వైరస్ ప్రస్తుతం మూడో దశలోకి ప్రవేశించింది. క్రితం వరకు న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లోనే ఉన్న ఈ మహమ్మారి నేడు నగరాలతో పాటూ గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా వ్యాపిస్తుంది.
ఈ మేరకు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిర్క్స్ మాట్లాడుతూ.. “అమెరికాలో కరోనా మూడో దశకు చేరింది. రానున్న రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉండనున్నాయని అన్నారు. వైట్ హౌస్ అమెరికన్లకు కొన్ని సూచనలను కూడా జారీ చేసింది. దీని ప్రకారం “50 ఏళ్లకు పైబడిన వృద్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో కి రాకూడదు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి లేనిచో వైరస్ మరింత విజృంభిస్తుందని అసిస్టెంట్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అడ్మిరల్ బ్రెట్ గిరోయిర్ తెలిపారు. అమెరికాలో గత 24 గంటల్లో 49,038 కేసులు బటయపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగానూ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. బ్రెజిల్లో కొత్తగా 24,801 కేసులు నమోదయ్యాయి.
దక్షిణాఫ్రికాలో 8,195 మందికి వైరస్ సోకగా.. రష్యాలో మరో 5,394 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్ట్రేలియాలో వైరస్ మళ్లీ ప్రభావం చూపుతోంది. అమెరికాలో ఈ స్థాయిలో కరోనా వ్యాప్తికి కారణం అధ్యక్షుడు ట్రంప్ అని మెజారిటీ అమెరికన్లు విశ్వసిస్తున్నారు . దీనితో నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చూడటం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.