
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే నెల మూడో వారంలో అర్హత రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది అదనపు నోటిఫికేషన్ను ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత పరీక్షలు నిర్వహించే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, ఆ తర్వాత కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల వాయిదాతోపాటు సచివాలయాల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కూడా నిలిచిపోయింది.
దీంతో ఆ ప్రక్రియను వచ్చే నెల పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు వచ్చే నెల 20 నుంచి ఓ వారం రోజులపాటు రాతపరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో 19 విభాగాల్లో 1187 పోస్టులను భర్తీ చేసే క్రమంలో పరీక్షలను విభాగాల వారీగానే నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటైజ్ స్ప్రే చేయాలని, థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.