
ప్రపంచాన్ని అణు బాంబులతో గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ అధ్యక్షుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆయన ఎలాంటి అస్వస్థతకు గురికాలేదని ఆ దేశ మీడియా కూడా చెప్పుకొచ్చింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు కిమ్ జోంగ్ ఆరోగ్యంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
తాజాగా కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అధ్యక్ష బాధ్యతలను చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి. కాగా కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లాడని, అందుకే అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్కు అప్పగించినట్లు గూఢచర్య వర్గాలు వెల్లడించాయని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్కు సహాయకుడిగా పని చేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు.
ఈ వార్తతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొంది. తమ అధ్యక్షుడికి ఏం జరిగిందో అని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరస్థితి బాగానే ఉందని మరోసారి ఉత్తర కొరియా ప్రభుత్వ అధికారులు అంటున్నారు.