ఈ సృష్టిలో మనుషులందరూ ఒకేలా ఉండరు. అలానే.. వారి ఆలోచనా తీరు ఒక్కోరిది ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది ఎంత కష్టమైనా పర్వాలేదు కోట్లు సంపాదించాలి అనుకుంటారు. మరికొంతమంది సంపాదించేది 10 రూపాయలు అయినా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటారు. అలా ప్రశాంతమైన జీవితం కోసం అన్వేషిస్తున్న ఓ యువతి వినూత్నమైన జాబ్‌ను ఎంచుకుంది. ఆడవాళ్లు అటు వైపు వెళ్లటానికే భయపడే పనిలోకి దిగింది. ఏకంగా కాటి కాపరిగా మారింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన టాన్ అనే యువతికి చిన్నప్పటికి నుంచి ప్రశాంతమైన, క్వాలిటీ జీవితం గడపాలని ఆశ. ఇందుకోసం ఎంతో రీసెర్చ్ చేసి గ్రేవ్ యార్డ్ కీపర్ చదువు చదివింది. చైనీస్ యూనివర్శిటీ నుంచి పట్టా పొందింది.
22 రెండేళ్ల వయసులోనే తన జీవితాన్ని శ్మశానానికి అంకితం చేసింది. ప్రస్తుతం వెస్ట్రన్ చైనా, చాంగ్‌క్వింగ్‌లోని పర్వత శ్మశాన వాటికలో పని చేస్తోంది. నెలకు దాదాపు 45,760 రూపాయలు సంపాదిస్తోంది. ఈ జాబ్‌లో వారానికి ఆరు రోజులు మాత్రమే పని ఉంటుంది. అది కూడా ఉదయం 8.30నుంచి సాయంత్రం 5 వరకు పని వేళలు. వీటిలో కూడా 2 గంటల లంచ్ టైం ఉంటుంది. దీనిపై టాన్ మాట్లాడుతూ.. ‘‘ కాటి కాపరి పని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆఫీస్ పాలిటిక్స్ ఉండవు. ఇక్కడి వాతావరణం కూడా చాలా అందంగా ఉంటుంది. నాతో పాటు పిల్లులు, కుక్కలు ఉంటాయి. ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా ఉంటుంది.
శ్మశానంలో నా పని ఏంటంటే.. సమాధుల్ని అమ్మాలి, ఎవరైనా అతిధులు వస్తే వారికి స్వాగతం పలకాలి. అప్పుడప్పుడు సమాధుల్ని శుభ్రం చేస్తూ ఉండాలి’’ అని తెలిపింది. ప్రస్తుతం టాన్ కాటి కాపరి పని వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ గతంలో ఇలాంటి పనికి ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం ఇదే ఎంతో ప్రశాంతమైన ఉద్యోగం’’.. ‘‘ నాకు ఈ ఉద్యోగం ఎంతగానో నచ్చింది. మనం మనుషుల్తో పని చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఉండవు’’ అని అంటున్నారు.