కుక్కల బారి నుండి మన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి. అంబర్ పేట్ ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నగర వాసులు గూగుల్ ఎక్కువుగా శోధిస్తోన్న ప్రశ్న. హఠాత్తుగా 10 కుక్కలు వెంటపడితే, ఏం చేయాలో ఎవరికీ తెలియదు. ప్రాణ రక్షణ కోసం దాడి చేయడమో, పరుగులు చేయడమో చేస్తుంటారు, ఇది ముమ్మాటికీ తప్పు. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వాటి బారి నుడి కొంత మేర బయటపడొచ్చు. ఆ చిట్కాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం..
కుక్కలు.. కుక్కలు.. నగర ప్రజానీకం దృష్టంగా వీటిపైనే ఉంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ప్రజలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలా అని వీటిని సమర్ధించే వారు లేకపోలేదు. కుక్కలకు పునరావాసం కల్పించాలని ఒకరంటే, వీటిని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని మరొకరు పిలుపునిచ్చారు. వీరి మాటలు ఎలా ఉన్నా.. అంబర్ పేట్ ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి.. కుక్కలను చూస్తూనే జనం వణికిపోతున్నారు. గ్రామ సింహాలుగా పేరున్న ఈ రక్షక దళం పేరు వినిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తున్నారన్నారు.
‘కుక్కలు విశ్వాసానికి ప్రతీక.. ఒక్కసారి వాటిని దగ్గరకు తీసుకుంటే.. అవి మన పట్ల జీవితాంతం విశ్వాసం చూపుతాయ్..’ ఇలాంటి కాకమ్మ మాటలు నమ్మకండి, దానికి మీరు శత్రువు అని భావించినప్పుడు అది మిమ్మల్నీ కాటేస్తుంది. ఇందులో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అన్న బేదజాలాలు ఉండవు. ఇదంతా చదివాక.. కుక్కల గురుంచి ఇంత సీరియస్ డిస్కషన్ అవసరమా ..? అని మీకనిపించొచ్చు. అది వాస్తవమే అయినా.. ఆ కుక్కలను ఏదో ఒకరోజు మీరూ పురుగులు తీసి ఉంటారన్న విషయాన్ని మరవకండి. పైకి చెప్పకపోయినా ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇప్పుడు హఠాత్తుగా మీ వెంట 10 కుక్కలు వెంటపడ్డాయంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
కుక్క/ కుక్కలు వెంటపడగానే డాగ్ రన్నింగ్..? డాగ్ చేజింగ్..? అస్సలు చేయకూడదు. మీరు ఎప్పుడైతే పరుగులు తీస్తారో అవి మీకంటే అవే శక్తివంతులు అనుకొని మిమ్మల్ని వెంబడిస్తాయి.. దాడి చేస్తాయి. అందువల్ల కుక్కలు కనిపించిన వెంటనే పరుగులు పెట్టడం సరికాదు. కుక్కలు కనపడి.. అవి మీ వంక అదోరకంగా చూస్తుంటే అక్కడే నిలిచిపోండి. ఎప్పటిలానే నడవండి. ఏదైనా కుక్క అరుస్తూ మీ వైపు వస్తే కదలకుండా బొమ్మలా నిలుచోండి. అంతే కొద్ది సేపటి తర్వాత అన్ని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. లేదు అలానే నిర్విరామంగా అరిచినా అక్కడే అలాగే నిలబడాలి. అనంతరం నెమ్మదిగా అక్కడ నుంచి నడక స్టార్ట్ చెయ్యండి.. కుక్కలు ఏమీ చెయ్యవు.
నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కుక్కల గుంపు కనిపడితే ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. వాటి వైపు అలానే చూస్తూ ఉంటారు. అది ముమ్మాటికీ తప్పు. వాటి కళ్లలోకి సూటిగా చూడకండి. మీ కళ్లెదుట ఎంత పెద్ద కుక్కల గుంపు ఉన్నా సరే మీరు వాటిని పట్టించుకోనట్లుగా వ్యవహరించండి. లేదు.. కళ్లలోకి కళ్ళు పెట్టి చూశారో.. అవి రెచ్చ గొట్టినట్లుగా ఫీలై మీ మీద దాడి చేస్తాయి. కావున వాటిని పట్టించుకోనట్టుగా వ్యవహరించడం ఉత్తమం.
కుక్క కానీ, కుక్కల గుంపు కానీ అరవడం చేస్తే.. మీరు చేసే మొదటి తప్పు పరుగులు పెట్టడం లేదంటే వాటిపైకి రాళ్లు విసరడం. ఇవి రెండు ప్రమాదమే. ఒకటి విసిరి అలానే నిల్చున్నారనుకో అవి మరింత రెచ్చిపోతాయి. అన్ని వైపుల నుంచి మీ మీద దాడి చేస్తాయి. ఇలాంటి సమయంలో కర్ర చేతిలో పట్టుకోండి. చేతిలో ఎటువంటి ఆయుధం లేకుంటే.. మీరు వేసుకున్న చెప్పులైనా, బ్యాగులైనా.. ఏదైనా సరే ఆయుధంగా మలుచుకోవాలి..వాటిపైకి విసురుతున్నట్లుగా నిలబడి ఉండాలి. అప్పుడే అవి మీకు దగ్గరగా రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తాయి.
కుక్కలకు మీరు వేసుకున్న రంగులు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. అందువల్ల అరుస్తూ ఉంటాయి. ఉదాహరణకు మంచి కలర్ షర్ట్ వేసుకొని.. నల్లటి కళ్లద్దాలు, తలపై ఎర్రటి టోపీ పెట్టుకున్నారనుకోండి.. కుక్కలకు అదేదో వింతగా అనిపించి వెంబడిస్తాయి. కనుక అవి కనిపించినా లేదా వెంబడించినా మీరు పెట్టుకున్న క్యాప్, కళ్లద్దాలు తొలగించడం చేయండి. అవి మనసు మార్చుకొని అక్కడే ఆగిపోతాయి.
గమనిక: ఈ కథనం కుక్కల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలపడానికి ఉద్దేశించినది. వాటిపై దాడి చేయమని, వాటిని దగ్గర రానివ్వకండి అని చెప్పడానికి కాదు.