కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అలాగే లాక్‌డౌన్ కూడా విధిస్తున్నాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.4 లక్షలు దాటింది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో కరోనాతో 7,227 మంది మృతిచెందారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకకు పరిమితికి మించి వందలాదిగా అతిథులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లికి హాజరైన అతిథులకు వింత శిక్ష విధించారు. పెళ్లిలో తిన్నది అరిగేంత వరకూ వాళ్ల చేత కప్పగంతులు వేయించారు పోలీసులు.
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలోని ఉమరి గ్రామంలో లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా 300 మంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేయడానికి వెళ్లారు. పోలీసులు రావడం గమనించిన కొందరు అతిథులు అక్కడి నుంచి తప్పించుకోగా కొంతమంది మాత్రం దొరికిపోయారు. దొరికిన 17 మందికి శిక్షగా రోడ్డు మీద కప్పగంతులు వేయించారు పోలీసులు. అందులో ఓ వ్యక్తి సరిగ్గా కప్ప గంతులు వేయకపోవడంతో ఓ పోలీసు అధికారి అతని కొట్టడానికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పోలీసులు లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు అలాంటి సమావేశాలకు హాజరుకావద్దని హెచ్చరించారు. ఆ తర్వాత వారిని వదిలివేశారు.