ఈ భూమ్మీద అత్యంత విషపూరిత జీవి అంటే.. వెంటనే పాము లేదా ఇతర జీవుల పేర్లు చెబుతారు.. కానీ మనిషిని మించిన విషపూరిత జీవి ఈ విశ్వంలో మరొకటి ఉండదు. తన ఎదుగుదల కోసం దేన్ని నాశనం చేయాడానికి అయినా సరే.. వెనగడుగు వేయడు. పాముకు కోరల్లో.. తేలుకు తోకలో విషం ఉంటుంది.. కానీ మనిషికి మాత్రం నిలువెల్ల విషమే అన్నాడు ఓ కవి. అయితే పాములాగా మనిషి కాటేయ్యడు.. తన విషపు ఆలోచనలతో లోకాన్ని నాశనం చేస్తాడు. సరే కాసేపు ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భూమ్మీద ఉన్న జీవరాశుల్లో.. మరీ ముఖ్యంగా పాముల్లో అత్యంత ప్రమాదకరం, విషపూరితమైన పాము.. కింగ్ కోబ్రా(నల్ల తాచు). ఇది కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో మనిషి ప్రాణాలు విడుస్తాడు. కింగ్ కోబ్రా అనే కాదు.. సాధారణంగా విషపూరితమైన పాములు కాటేస్తే.. వెంటనే చికిత్స తీసుకోకపోతే.. మనిషి చనిపోతాడు. కానీ ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మనిషి కాటేసిన కింగ్ కోబ్రా.. అనూహ్యంగా అదే ప్రాణాలు విడిచింది.
ఈ భిన్నమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరలవుతోంది. ఇక వీడియోలో ఉన్న దాని ప్రకారం.. బాగా తాగి ఉన్న ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రి.. అత్యవసర విభాగానికి వచ్చాడు. డాక్టర్లను పిలిచి.. తనను కింగ్ కోబ్రా కాటేసిందని తెలిపాడు. ఆ తర్వాత కాసేపటికే అది చనిపోయందని వెల్లడించాడు. అతడి మాటలు విన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా కాటేస్తే.. ఆ మనిషి చనిపోవడం పక్కా.. కానీ ఇదేంటి రివర్స్‌లో ఇలా జరిగింది అని వైద్యులు ఆశ్చర్యపోయారు. పైగా ఆ వ్యక్తి మద్యం సేవించి ఉండటంతో అతడి మాటలు నమ్మలేదు.
దాంతో సదరు వ్యక్తి డాక్టర్లను నమ్మించేందుకు.. తనతో పాటు పాలిథిన్ వరల్లో తీసుకువచ్చిన పామును వారి ముందు ఉంచాడు. అది చనిపోయి ఉంది. ఈ సంఘటనతో వైద్యులు షాక్ అయ్యారు. వెంటనే సదరు వ్యక్తిని అత్యవసర విభానికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది తెగ వైరలవుతోంది.
దీనిలో తాగిన వ్యక్తి వైద్యులతో మాట్లాడటం.. తన కాలు మీద పాము కాటు వేసిన గుర్తులను చూపించడం ఉంది. అయితే ఈ వీడియో చూసిన జనాలు.. వామ్మో వీడు పాము కన్నా డేంజర్ రా సామి అని కామెంట్స్ చేయగా.. చాలా మంది మాత్రం.. ఇది నిజం కాదు.. కావాలనే ఇలా యాక్షన్ చేసి ఉంటారు.. ఇది ఫేక్ వీడియో అని అని కామెంట్స్ చేస్తున్నారు.