ఎందుకు పనికి రావు, తిని కూర్చోడమే పనా నీకు? ఒక్క పని కూడా చేయవు. ఇలాంటి మాటలు వింటూ ఉంటారు, అలాంటి వారిని చూస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు అలాంటి వారే కావాలి.. ఉద్యోగాలిస్తామంటూ వెతుకుతున్నారు. అంతా ఇంతా కాదు.. ఏకంగా నెలకి 50 వేల రూపాయలు. మీరు చేయాల్సిందల్లా వారు పెట్టే ఫుడ్ తిని అది ఎలా ఉందో రివ్యూ ఇవ్వాలన మాట.
యూకేలోని బొటానిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ ఈ ఉద్యోగాలు ఇస్తోంది. ఈ ఉద్యోగం పేరు ‘ప్రో టాటో టెస్టర్’ అని పెట్టారు. ఆదివారం వారి మధ్యాహ్న భోజనంలో భాగంగా బంగాళదుంపలు వేయించి ప్రత్యేకంగా ఓ వంటకం చేస్తారు. అది తిని దాని రుచి ఎలా ఉందో చెప్పాలి. అంటే, రూ.50 వేలు ఇస్తారు కదా.. ఊరికే చెప్తే సరిపోదు. ఆ వంటకం ఎలా ఉందో ఒక 500 పదాలతో ఓ రివ్యూ రాయాలి. రివ్యూని వీడియో రూపంలో కూడా రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలి. అలా చేసేందుకు నెలకు 50 వేల రూపాయలు ఇస్తారనమాట. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఈ నెల 12వ తేదీ వరకు గడువు ఉంది. మరి పాస్‌పోర్టు ఉండి, మీరు బాగా రివ్యూ రాయగలను అన్న నమ్మకం ఉంటే అప్లై చేసేయండి.