తండ్రిపై తన ఇద్దరు కూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవును మీరు విన్నది నిజమే. వచ్చి రాని మాటలతో.. మా నాన్నను అరెస్ట్ చేయండి అంటూ పోలీసులను వేడుకున్నారు. అసలేం జరిగిందంటే?
అంకుల్ ప్లీజ్.. వెంటనే మా నాన్నను అరెస్ట్ చేయండి అంటూ ఇద్దరు చిన్నారులు వచ్చి రాని మాటలతో పోలీసుల ముందు వివరించారు. ఆ చిన్నారుల మాటలతో స్టేషన్ లో ఉన్న పోలీసులు అంతా కరిగిపోయారు. ఇక వెంటనే ఆ చిన్నారులతో పాటు వారి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆ చిన్నారుల తల్లిదండ్రుతో మాట్లాడి వారి సమస్యను కొంత పరిష్కరించారు. ఇంతకు ఆ ఇద్దరు చిన్నారులు ఎందుకు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు? ఆ చిన్నారుల తండ్రి చేసిన నేరం ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లా భిటర్వార్ ప్రాంతం. ఇక్కడే ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లల సంతానం. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు తరుచు గొడవ పడుతున్నట్లు సమాచారం. దీంతో భర్త తన ఇద్దరి కూతుళ్ల ముందే భార్యపై దాడి చేసేవాడు. రోజూ తల్లిదండ్రులు గొడవ పడడంతో ఆ పిల్లలకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ ఇద్దరు చిన్నారులు ఎవరి సాయం లేకుండా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
వీరిని గమనించిన స్టేషన్ ఇంఛార్జ్ ప్రదీప్ శర్మ.. ఆ పిల్లలను మెల్లగా ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. భయపడకుండా ఏం జరిగిందో చెప్పండి అంటూ వారిని అడిగాడు. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు వచ్చి రాని మాటలతో.. మా నాన్న అమ్మను రోజూ కొడుతున్నాడు. మీరు వచ్చి కాపాడండి అంటూ వేడుకున్నారు. వీరి మాటలు విన్న ప్రదీప్ శర్మ గుండె ఒక్కసారిగా తురుక్కుపోయింది. ఆ అధికారి వెంటనే ఆ పిల్లలతో పాటు నేరుగా వారి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి.. పిల్లల ముందే మీరిద్దరు గొడవ పడతారా అంటూ వారి తల్లిదండ్రులను హెచ్చరించారు.
మీరు గొడవలు పడితే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సూచించారు. ఇక దీంతో పాటు భార్యపై దాడి చేస్తున్న భర్తకు పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక మొత్తానికి పోలీసులు ఆ దంపతులకు కౌన్స్ లింగ్ ఇవ్వడంతో సమస్య కొంత పరిష్కారం అయింది. అయితే ఆ ఇద్దరు చిన్నారులు స్టేషన్ లో పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ చిన్నారుల ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.