తాతలు, ముత్తాతల కాలంలో ఏ ఇంట్లో చూసిిన గంపెడు మంది పిల్లలు ఉండేవారు. వారిని సాకలేక.. అనేక ఇబ్బందులు పడేవారు. చాలీ చాలని జీతంతో బతికేవారు. అయితే తర్వాత జనాభాను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను తీసుకు వచ్చాయి. ముగ్గురు లేదా ఇద్దరు పిల్లలు పుట్టేవారు. ఇప్పుడైతే ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. కానీ ఈ జంట కాస్త భిన్నం.
మన తాతలు, ముత్తాతల కాలంలో బంధువులు, చుట్టాలు, స్నేహితులు కలుసుకున్నప్పుడు మీకెన్ని ఆస్తులు ఉన్నాయి అని అడిగేవారు కాదట. మీకెంతమంది పిల్లలు అనే ప్రశ్నలు ఎక్కువగా వచ్చేవట. అంటే సంతానాన్ని సంపాదనగా చూసే కాలం అది. అయితే జనాభా వృద్ధి చెందుతుండటంతో ఆర్థిక సంక్షోభానికి దారి తీయెచ్చునని పలు ప్రభుత్వాలు 19వ శతాబ్దం మధ్యలో కుటుంబ నియంత్రణను తెచ్చాయి. ముగ్గురు పిల్లల దగ్గర నుండి మేమిద్దరం మాకిద్దరూ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక్కడిని పెంచడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు భార్యా భర్తలు. అందుకే ఒక్కరితోనే సరిపెడుతున్నారు. అయితే ఈ జంట అందుకు భిన్నం. ముత్తాతల నాటి ఆలోచనలతో బతుకుతున్నారు. ఒక్క సంతానమే ముద్దు అనే హద్దుల్ని చెరిపేసి పిల్లల్ని కంటున్నారు. ఒకరా ఇద్దరా వీరి సంతానం సంఖ్య చెబితే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఇంతకు ఆ జంట ఎవరంటే.
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నివాసముంటున్నారు ఆండ్రే డ్యూక్ ఆయన భార్య కోరా డ్యూక్. కోరా డ్యూక్‌కు ప్రస్తుతం 39 ఏళ్లు. అయితే ఆమె 28 ఏళ్ల ప్రాయంలోనే 9 మంది పిల్లలకు తల్లయింది. ఆశ్చర్యపోతున్నారు కదా.. అవునండీ ఈ జంటకు 9 మంది పిల్లలు. 2001లో పదిహేడేళ్ల వయసులో కోరా తొలి సారి గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అలా 2012 వరకు అంటే సుమారు 12 ఏళ్ల పాటు పిల్లలను కంటూనే ఉంది. ఈ 9 మంది పిల్లల్లో మూడో సంతానంగా పుట్టిన బిడ్డ ఏడు రోజులకే చనిపోయింది. దీంతో మొత్తం 8 మంది బిడ్డలతో జీవనం సాగిస్తున్నారు ఈ జంట. ఇటీవల కోరా తన సంతానంతో కలిసి ఓ టిక్ టాక్ వీడియో చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వయసుల వారీగా తమ పిల్లలను వరుసగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ ఓ వీడియో తీసి పోస్టు చేసింది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.
ఆండ్రే డ్యూక్, కోరాలది ప్రేమ వివాహం. ఒకే పాఠశాలలో చదువుకున్న వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2001లో వివాహం కాగా.. . అదే ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చారు కోరా. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా సగటున ఓ బిడ్డను కన్నారు. ఇప్పుడు మొదటి బిడ్డ ఎలిజా వయసు 21. రెండో కుమార్తె షేనా వయసు 20 ఏళ్లు. జాన్ (15), కైరో (15), సయా (14), అవి (13), రోమని (12), తాజ్ (10) పిల్లలు ఉన్నారు. 2004లో పుట్టిన మూడో సంతానం వారం రోజులకే చనిపోయింది. అయితే ఇంత మంది పిల్లల్ని కనడంపై కోరా స్పందిస్తూ… ఉద్దేశపూర్వకంగా తాను ఇంత మందిని కనలేదని, సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం దాల్చినట్లు తెలిపింది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. మాతృత్వం తనకు సహజంగా వచ్చిందని తన భర్త సహకారంతో అనేక అడ్డంకులను అధిగమించాను అని కోరా తెలిపారు.