సాధారణంగా ఆధ్యాత్మికతకు, దేవాలయాలకు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం సహజం. కానీ అదే విషయం వెయ్యి సంవత్సరాలకు ముందుమాట అయితే ఖచ్చితంగా నోరు వెళ్ళబెట్టాల్సిందే. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఓ శివలింగం.. దాదాపు 500కోట్లు విలువ చేస్తుందనే వార్త ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. 1000 ఏళ్ల కాలంనాటి 500 కోట్ల విలువైన శివలింగాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తంజావూరు జిల్లాలోని అరుళానంద నగర్ నివసించే సంయప్పన్ అనే వ్యక్తి ఇంట్లో విగ్రహాల అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు.. డిసెంబర్ 30న ప్రత్యేక బృందంతో సంయప్పన్ ఇంట్లో సోదాలు జరిపింది. సోదాలు జరిపే సమయంలో సంయప్పన్ కొడుకును పోలీసులు ప్రశ్నించగా.. తండ్రి బ్యాంకు లాకర్ లో దాచిపెట్టిన మరకత శివలింగం విషయం బయటపెట్టాడు.
వెంటనే పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిపుణులు పరిశీలించి శివలింగం విలువ దాదాపు 500కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఈ శివలింగం వెయ్యేళ్ళ నాటిదని, ముసుగుంట చోళరాజు దానం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ శివలింగం ఏ దేవాలయానికి చెందింది? అనేది తెలియాల్సి ఉందట. మరి ఈ విగ్రహాన్ని దొంగిలించారా? లేక విదేశాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.