అమ్మవారు కళ్లు తెరిచారు, విగ్రహం నుండి విబూది రాలుతోంది, శివుడిపై నాగుపాము పడిగ విప్పింది.. ఈ కోవకు చెందిన వార్త కాదండోయ్ ఇది. మానవ శరీర స్పర్శకు ఏమాత్రం తీసిపోకుండా, ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను ఆశీర్వదించే షిరిడీ సాయి. అంతేకాదు స్వయంగా భక్తులకు సూక్తులు భోదిస్తున్నారు. ఆ.. ఏంటి స్వయంగా బాబానే ప్రత్యక్షమై బోధనలు భోదిస్తున్నారని చెప్తుంటే మీకు నమ్మకం కలగడం లేదా.. అయితే, అసలు సంగతేంటో మీరే తెలుసుకోండి..
ఇదొక రోబోటిక్ సాయిబాబా అన్నమాట. ఈ విగ్రహాన్ని విశాఖనగరంలోని చినగదిలిలో గల సాయిబాబా ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. ఈ రోబో విగ్రహానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో బాబా విగ్రహం కళ్లు కదపడం, తల కదిలించడం, మాట్లాడటం కూడా సాధ్యపడింది. దీని ద్వారా భక్తులకు ప్రవచనాలు బోధిస్తున్నారు. బాబా భక్తుడు, ఔత్సాహికుడు వై రవిచంద్ మూడేళ్లు శ్రమించి ఈ విగ్రహం తయారు చేశారు. ఈ విగ్రహం గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రచారం జరగడంతో ఆలయానికి భక్తుల తాకిడి కూడా బాగా పెరిగిందట. ఈ రోబోటిక్ గురుంచి మీకు మరిన్ని వివరాలు తెలియాలంటే.. ఈ కింది వీడియో చూసేయండి..