చెత్త ఏరుకునే ఓ యువకుడి పట్ల ఓ పోలీస్ అధికారి చూపించిన మంచి మనసు అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులంటే ప్రజలకు ఏదో ఒక మూల భయం, కోపం ఉండనే ఉంటాయి. కొంతమంది పోలీసులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు ఇందుకు కారణం అని చెప్పొచ్చు. బ్రిటీష్ కాలం నాటి వ్యవహార శైలితో కొంతమంది పోలీసులు సాధారణ ప్రజలతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అయితే, పోలీసుల్లో కూడా మంచి వాళ్లు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్లు తమ మంచి మనసు చాటుకుంటూ ఉన్నారు. తాజాగా, ఓ పోలీస్ చెత్త ఏరుకునే ఓ యువకుడిపై ఎంతో జాలి చూపించాడు. అతడి పరిస్థితికి చలించి ఓ మంచి బహుమతి ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్నాడు.
ఓ రోజు ఆ యువకుడు మెయిన్ రోడ్డు మీద చెత్త సంచి భుజానికి తగిలించుకుని వెళుతూ ఉన్నాడు. ఆ యువకుడి ఒంటిపై బాగా మాసిపోయిన చొక్కా.. ఓ నిక్కరు ఉన్నాయి. కాళ్లకు చెప్పులు కూడా లేవు. చెప్పులు లేకపోవటంతో మండే ఎండలో ఆ రోడ్డుపై ఎంతో ఇబ్బందిగా నడుస్తూ ముందుకు వెళుతున్నాడు. మెయిన్ రోడ్డులో నిలబడి ఉన్న ఓ పోలీస్ ఆ యువకుడి పరిస్థితి గమనించాడు. ఆ ఎండలో మాసిన బట్టలు, చెప్పులు లేకుండా అతడు తిరగటం ఆ పోలీస్ మనసును కలిచి వేసింది. వెంటనే ఆ యువకుడ్ని దగ్గరకు పిలిచాడు. తాగటానికి ఓ బాటిల్ నీళ్లు ఇచ్చాడు.
అంతేకాదు.. ఆ యువకుడ్ని తీసుకెళ్లి ఓ పాంట్స్.. బ్లూ టీషర్టు ఇప్పించాడు. వేసుకోవటానికి చెప్పులు కూడా కొనించాడు. పోలీస్ చూపిన ప్రేమకు యువకుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. సంతోషంతో గెంతులు కూడా వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. పోలీస్ గొప్ప మనుసుకు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటి పోలీసుల వల్లే మానవత్వం ఇంకా బతికుందని అంటున్నారు. మరి, ఈ పోలీస్ చేసిన మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.