Love: ప్రేమ గురించి ఎంత చెప్పినా.. ఎంత మంది చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా.. ఇంకా చెప్పుకోవటానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ప్రేమ ఎప్పుడైనా.. ఎవ్వరిమీదైనా కలగొచ్చు. ఒక్కసారి మనస్పూర్తిగా ప్రేమిస్తే.. జాతి, కులం, మతం, అందం, చందం ఇవేవీ చూసుకోము. నిజంగా చెప్పాలంటే ప్రేమ కళ్లతో కాదు.. మనసుతో చూస్తుంది. అందుకే దానికి ఎదుటి వాళ్ల మనసు తప్ప ఇంకేమీ కనిపించవు. దీని కారణంగానే ప్రేమ గుడ్డిది అంటుంటారు. ప్రపంచంలో ప్రేమ గొప్ప తనాన్ని చాటి చెప్పే సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా, ఓ పాకిస్తానీ మహిళ తన ఇంటి పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జీతం కోసం పనిచేసే వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన నాజియా ఒంటరి. ఈ నేపథ్యంలో ఇంటి పనులకోసం ఓ మంచి వ్యక్తిని పనిలో పెట్టుకోవాలనుకుంది. చుట్టు పక్కల వారిని ఈ విషయమై ఎంక్వైరీ చేసింది. ఆ సమయంలో సూఫియాన్ గురించి తెలిసింది. వెంటనే అతడ్ని పనిలోకి తీసుకుంది. సూఫియన్ నెలకు 18వేల జీతంతో నాజియా దగ్గర పనిలో కుదిరాడు.
సూఫియాన్ ఎవరూ లేని అనాథ. చాలా సింపుల్‌గా ఉండేవాడు. అందరినీ గౌరవించేవాడు. రోజులు గడుస్తున్నాయి. నాజియా విన్న దానికంటే సూఫియాన్ ఎంతో మంచి వాడిగా ఉన్నాడు. మంచి అలవాట్లు, ప్రవర్తనతో ఆమెను ఇట్టే ఆకర్షించాడు. రోజు రోజుకు సూఫియాన్‌పై ఆమెకు ఇష్టం పెరగసాగింది. కొద్దిరోజుల క్రితం నాజియానే అతడికి ప్రపోజ్ చేసింది. దీంతో సూఫియాన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అతడు కూడా ఆమె ప్రేమను ఒకే చేశాడు.
అయితే, వీరి పెళ్లికి నాజియా బంధువులు అంగీకరించలేదు. కానీ, నాజియా మాత్రం వారిని లెక్కచేయకుండా సూఫియాన్‌ను పెళ్లిచేసుకుంది. భర్తతో సంతోషంగా గడుపుతోంది. వీరి ప్రేమ గురించి తెలిసిన ఓ యూట్యూబ్ ఛానల్ వీరిని ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరి ప్రేమ కథ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. వీరి జంటను అందరూ ప్రశంసిస్తున్నారు. మరి, ఈ ప్రేమ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 39 Times Google: గూగుల్ కొలువు కోసం.. 39 సార్లు ప్రయత్నించి.. చివరకు..?