పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. యవ్వనంలో ఉండగా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే బాగుంటుందనిపిస్తుంది.. కానీ ఆ తర్వాత ఓ వయసు వచ్చాక జీవితంలో ఓ తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక పెళ్లి విషయంలో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలకు ఎక్కువ భయాలు, ఆశలు, కోరికలు ఉంటాయి. ఎందుకంటే.. సుమారు 20 ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరిగిన అమ్మాయి.. ఉన్నట్లుండి పెళ్లి పేరుతో మరో కుటుంబానికి తరలి వెళ్తుంది. కొత్త మనుషులు, అనుబంధాలు.. బాధ్యతలు. అప్పటి వరకు పుట్టింటిలో కనీసం పొయ్యి కూడా వెలిగించని తను.. అత్తింటిలో అన్నపూర్ణలా మారాలి. ఇంట్లో ఎవరికి ఏం కాంవాలో తెలుసుకుని.. సమయానికి అమర్చాలి.
అయితే అత్తింటి వారు కోడలిని కూడా తమ కూతురిలా భావించి ఆదరిస్తే.. బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ చాలా వరకు అత్తవారింటిలో ఆడ పిల్లలకు చేదు అనుభవాలే ఎదురవుతాయి. కోడలు అంటే.. కట్నం తీసుకువచ్చే పని మనిషిలా చూస్తారు చాలా మంది. కొత్తగా మన ఇంట్లోకి వచ్చింది.. ఆ భయం పొగొట్టి.. నువ్వు మా బిడ్డవే అని అభయం ఇవ్వాల్సింది పోయి.. మాకు చాకిరీ చేయడానికే నువ్వు మా ఇంటికి వచ్చావు.. ఈ పనులన్ని నువ్వు చేయాల్సిందే అన్నట్లుగా ప్రవర్తిస్తారు.
అత్తమామాల ఆరళ్లు.. ఆడపడుచుల సాధింపులు.. వెరసి.. ఏంటి నా జీవితం.. అమ్మనాన్నల దగ్గర యువరాణిలా పెరిగిన నేను.. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఏంటి.. ఎందుకిలా జరుగుతుంది.. అంటూ బాధపడుతుంది. ఫలితంగా అత్తవారిల్లు అంటే.. అదోరకమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. కొందరు మాత్రం.. పరిస్థితులను అర్థం చేసుకుని చక్కదిద్దుకుంటారు. అలాంటి ఓ కొత్త పెళ్లి కుమార్తె అత్తింటిలో తనకు ఎదురవుతున్న అనుభవాల గురించి తల్లికి లేఖ రాసింది. దానిలో ఆమె చెప్పిన సంఘటనలు ప్రతి మహిళ జీవితంలో ఎదుర్కొన్నవే. వాటిని చదివిన వారు మా జీవితంలో కూడా ఇలా జరిగింది అంటూ.. భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ వివరాలు..
ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు లేవు. కానీ లేఖలో మాత్రం సదరు కొత్త పెళ్లి కుమార్తె.. ‘‘అమ్మ.. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని మీరు నాన్న చెప్పగానే.. అందరు ఆడపిల్లల్లానే నేను కూడా వివాహం గురించి ఎన్నో కలలు కన్నాను. నాకోసం రాకుమారుడు వస్తాడని.. అతడితో కలిసి నా మిగిలిన జీవితం సంతోషంగా గడుపుతానని భావించాను. కానీ వివాహం అయ్యి అత్తవారింట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే.. పెళ్లి అంటే పూలపాన్పు కాదని నాకు అర్థం అయ్యింది. వైవాహిక జీవితం గురించి నేను ఊహించుకున్నది వేరు.. నాకు ఇక్కడ ఎదురవుతున్న పరిస్థితులు వేరు. అత్తారింట్లో నాకోసం.. నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు.. ఇలా ఎన్నో ఇక్కడ వేచి చూస్తున్నాయి. నా జీవితం నా చేతి నుంచి చేజారిపోయింది’’ అని రాసుకొచ్చింది.
‘‘ ఇక అత్తారింట్లో.. అందరికన్నా ముందు నేనే లేవాలి. మిగితా వాళ్లకు కావాల్సిన వాటిని సిద్ధం చేయాలి. మన ఇంట్లో మాదిరిగా రోజంతా నైట్ డ్రెస్, పైజామాలతో ఈ ఇంట్లో తిరగలేను. నాకు నచ్చినప్పుడు లేవలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నేను నడుచుకోవాలి. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి.. ఎవరు పిలిచినా వెంటనే స్పందించాలి. ఇక్కడ ప్రతివాళ్ల తమకు కావలసినవన్నీ.. వారు అడక్కుండానే నేను సిద్ధం చేయాలని ఆశిస్తారు. నా ఇష్టాలను పూర్తిగా చంపుకోవాలి. నాకంటూ ఓ జీవితం లేదని అర్థం అయ్యింది. వీరందరి అవసరాలు తీర్చడం నా బాధ్యతగా భావిస్తున్నారు. మీతో ఉన్నప్పుడు.. నాకు నచ్చినప్పుడు పడుకున్నాను.. లేచాను. కానీ ఇక్కడ అలా చేయడానికి వీలు లేదు. ఇక నా ముఖంలో నిత్యం చిరునవ్వు ఉండాలి.. నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెట్టాలి’’ అని భావిస్తారు..
‘‘మన ఇంట్లో మీరు నన్ను యువరాణిలాగా.. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నా మీద ఎంతో శ్రద్ధ చూపేవారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ అత్తవారింట్లో.. అందరి గురించి నేనే శ్రద్ధ తీసుకోవాలి. నా గురించి ఎవరు పట్టించుకోరు. ఒక్కోసారి మీ దగ్గరే సంతోషంగా ఉండక.. ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. ఆ క్షణం నీ దగ్గరకు వచ్చి.. నీ ఒళ్లో తలపెట్టుకుని పడుకోవాలనిపిస్తోంది. మీ ప్రేమను, గారాబాన్ని తిరిగి పొందాలనిపిస్తోంది. మన ఇంట్లో నాకు ఇష్టమైనవన్నీ.. నీ చేత్తో వండించికుని తృప్తిగా తినాలని ఉంది. నా స్నేహితులతో సంతోషంగా గడపాలని ఉంది’’ అని తెలిపింది.
‘‘ నేను ఇలా ఆలోచించిన వెంటనే నాకు ఓ విషయం గుర్తుకు వస్తుంది. కొన్నాళ్ల క్రితం నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లిన మనిషివే కదా. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఉంటావు. నువ్వు ఎలాగైతే గొప్ప సుఖాన్ని.. శాంతిని, సౌకర్యాలను మాకు అందించావో.. ఇప్పుడు నేను కూడా నా అత్తవారింట్లోని కుటుంబ సభ్యులకు వాటిని అందించాల్సిన బాధ్యత నా మీదే ఉందని గుర్తుకొస్తుంది. అప్పడు నాకు కొంత ధైర్యం కలుగుతుంది అమ్మ. కొన్నాళ్లు గడిచేసరికి.. నేను కూడా నీలానే ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం ప్రారంభిస్తాను. నాకు వివాహం అయిన తర్వాత అర్థమైంది.. నువ్వు మా సంతోషం కోసం ఎన్ని త్యాగాలు చేసి ఉంటావో.. ఎన్నిసార్లు.. నీ మనసుతో రాజీ పడి ఉంటావో. వాటన్నింటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కూడా నా బాధ్యతలని అలానే నేరవేరుస్తాను.. లవ్ యూ అమ్మా. థాంక్యూ అండ్ మిస్ యూ సో మచ్’’ అంటూ రాసుకొచ్చింది. ఈ లేఖ చదివిన వారు తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.