నేటి ఆధునిక పోటీ ప్రపంచ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లాడి నుంచి పొలం పనులకు వెళ్లే ముసలాయన వరకూ ఇలా ప్రతీ ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఓ పూట తిండి లేకున్న సరే ఉంటారు కానీ.., చేతిలో సెల్ ఫోన్ లేకుంటే మాత్రం ప్రపంచమంత తలకిందులైనట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలోని ఓ యువతి హాస్టల్ లో ఉంటున్న 60 మంది యువతుల నగ్న వీడియోలను లీక్ చేసి ఫ్రెండ్స్ కు పంపడంతో పాటు సోషల్ మీడియాలో సైతం అప్ లోడ్ చేసింది.
దీనిని తెలుసుకున్న బాధిత యువతులు న్యాయం చేయాలంటూ యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి దృష్టి స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీపై పడింది. మొబైల్ వాడే వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి లీకుల బెడద ఉంటుందని టెక్నాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు ఇలాంటి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి కాలంలో చాలా మంది కేటుగాళ్లు ప్రేమ పేరుతో వంచించి మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అలా కలిసున్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. అలా తీసుకున్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ వెబ్ సైట్ లో పెట్టడం లేదంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ వాడే వారు కాస్త అలెర్ట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏది పడితే ఆ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితులే వస్తే ఖచ్చితంగా అందులో పొందుపర్చిన నిబంధనలను పూర్తిగా చదవాలి. దీంతో పాటు కొందరు సైబర్ నేరగాళ్లు ఏదో ఒక లింక్ ను ఇతరులకు పంపి ఆ లింక్ ను ఓపెన్ చేసే విధంగా ఉసిగొల్పుతున్నారు. అలాంటి లింక్ లను క్లిక్ చేయడం వల్ల మన డేటాను చోరీ చేయడంతో పాటు మరెన్నో రకాల ఇబ్బందులను కొనితెచ్చుకున్నవారవుతుతారు. అయితే సాధారణంగా నెలకు ఒక కొత్త మొబైల్ మార్కెట్ లోకి వస్తు ఉంటుంది.
ఆ కొత్త మొబైల్ లపై ఆశపడేవారు పాత ఫోన్ లలో ఉన్న డేటా, వీడియోలు, ఫోటోలు డిలెట్ చేయకుండా అలాగే ఇతరులకు అమ్మకూడదు. అలా ఆ ఫోన్లు కొనుగోలు చేసిన ఆ వ్యక్తి అందులో ఉన్న ఫోటోలను, వీడియోలను బ్యాకప్ ద్వారా రికవరీ చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతుంటారు. ఇక దీంతో పాటు మీరు అమ్మిన మొబైల్ లో మెమోరీ బ్యాకప్ ఆన్ చేసి పెట్టకుండా ఆప్ చేసి పెట్టాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే మన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను ఆసరాగా చేసుకుని కొంతమంది వెబ్ సైట్ కు అమ్ముతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.