ఆంటీ.. ఈ పదం ఎవరికీ కొత్తేం కాదు. చాలా ఏళ్లుగా ఆంగ్లం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఈ పదాన్ని మనవాళ్లు విచ్చలవిడిగా వాడేస్తుంటారు. అయితే ఈ పదం వల్ల మనోభావాలు దెబ్బతినే వాళ్లు.. ఇలా పిలవడం వల్ల చివాట్లు తిన్నవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. నిజానికి ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడుతుంటాం. ఒకటి అత్తలు, పిన్నులను పిలిచేందుకు అంతా పాషుగా ఆంటీ అని పిలుస్తున్నారు. మరొకటి ముక్కూ మొఖం తెలియని మహిళలను పిలిచేందుకు ఆంటీ అనే పదాన్ని వాడుతున్నారు. అయితే ఎవరిని అలా పిలుస్తున్నారు అనేది ఇక్కడ లెక్క. చాలా మంది 25 ఏళ్లు కూడా నిండని వారిని ఆంటీ అనేస్తున్నారు. అదికూడా 20 ఏళ్ల అమ్మాయిలు, అబ్బాయిలు అలా పిలుస్తున్నారు.
నిజానికి చాలా మంది పైకి చెప్పుకోరు కానీ.. అలా పిలిస్తే లోలోపల వాళ్లు ఎంతో బాధ పడతారు. కొందరు అయితే ఆ విషయాన్ని పైకి చెప్పేస్తారు. కొందరు మాత్రం అలా చెప్పుకోలేక ఆత్మన్యూనతకు గురౌతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ మాత్రం అలా లోపల ఏమాత్రం దాచుకోకుండా పైకి చెప్పేసింది. అది కూడా అలా ఇలా కాదు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. ఆమె వార్నింగ్ చూస్తే తెలిసిన వాళ్లని కూడా ఆంటీ అనాలంటే భయం కలగచ్చు. అంత స్ట్రాంగ్ కౌంటర్, వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఎవరిని ఆంటీ అని పిలుస్తారు అంటూ ఆమె బాధను కూడా చెప్పుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోలో మహిళ మాట్లాడుతూ.. “14 ఏళ్లకే పెళ్లి చేసుకుని.. 30 ఏళ్లకే ఇద్దరు పిల్లలను కనగానే ఆంటీ. అదే 35 ఏళ్ల వరకు ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, డబుల్ పీజీ చేసి, యూకే ఎంఎస్ చేసి.. సగం ముసలాళ్లు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే వాళ్లు చెల్లెళ్లు. మేమేమో పిల్లల్ని కంటే 35 ఏళ్లకు ఆంటీలం. ఆంటీ అన్నోళ్లను అనగబెట్టి సంపాలే” అంటూ సదరు మహిళ ఎంతో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆమె ఒక జూనియర్ ఆర్టిస్ట్ దాండియా ఆడేందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఆమె ఎవరు? అసలు ఈ వీడియో ఎక్కడ తీశారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు మగాళ్లకు కూడా ఈ బాధ ఉంటూనే ఉంటుంది. కుర్రాళ్లను కూడా పట్టుకుని కొందరు అంకుల్ అంటుంటారు. ఇంకొందరైతే డిగ్రీ పిల్లలు కూడా 25 ఏళ్ల కుర్రాడిని పట్టుకుని అంకుల్ అంటూ పిలుస్తుంటారు.