ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అరుదైన వస్తువులు ఉన్నాయి. వాటికి అప్పుడప్పుడు వేలం నిర్వహిస్తుంటారు. ఔత్సాహికులు వేలంలో పాల్గొని తమకు నచ్చిన వస్తువును దక్కించుకుంటారు. అలాంటి వేలమే ఒకటి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో జరిగింది. అయితే అక్కడ జరిగిన వేలం.. అందులో అమ్ముడుబోయిన వస్తువు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును మరి ఆ రేంజ్ లో దాని ధర పలికింది. అది 55 ఏళ్ల నాటి విస్కీ బాటిల్. దాని ధర ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.4.14 కోట్లు పలికింది.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో ఈ వేలం జరిగింది. అందులో జపాన్ కు చెందిన మద్యం తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఏళ్ల పాతదైన విస్కీ బాటిల్ ను వేలంలో పెట్టారు. ఆ వేలంలో 8 మంది పాల్గొన్నారు. వారిలో చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రూ.4.14 కోట్లు(4,88,000 పౌండ్లు) చెల్లించి ఈ అరుదైన విస్కీ బాటిల్ సొంతం చేసుకున్నాడు.
ఈ విస్కీ బాటిల్ అంత ఈజీగా తయారు చేసేది కాదు, మార్కెట్ లో అంత ఈజీగా దొరికేది కూడా కాదు. 1960లో సుంటోరీ వ్యవస్థాపకుడు షింజిరో టోర్రి ఈ యమజాకీ విస్కీని ప్రత్యేకంగా రూపొందించాడు. మూడు అరుదైన సింగిల్ మాల్ట్ విస్కీలను బ్లెండ్ చేసి ఈ స్కాచ్ ని తయారు చేశాడు. అంతేకాదు ఈ సుంటోరీ కంపెనీ అరుదైన విస్కీని తయారు చేసి ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తూ ఉంటుంది. ఒక విస్కీ బాటిల్ రూ.4.14 కోట్లు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.