ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో చోట ఏవేవో వింతలు కనిపిస్తూనే ఉన్నాయి.. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. సామాన్యంగా ఓ ఊరికి చెందిన మనుషుల గురించి తెలుసుకోవడం, ఊరి గురించి మాట్లాడుకోవడం మాములే. కానీ ఆ ఊరే మ్యాప్ లో మనిషి రూపం కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్చల్లో నిలుస్తుంది. తాజాగా మనిషి రూపం పోలిన ఆ ఊరు వార్తల్లోకెక్కి వైరల్ అవుతోంది.
మరి ఇంతకీ అది ఊరేనా లేక పట్టణమా? ఎక్కడుంది? అంటే మాత్రం మనం ఇటలీ దేశానికి వెళ్లాల్సిందే. అవును.. ఇటలీ దేశంలోని సెంటూరిపే(Centuripe) అనే చిన్న పట్టణం గురించే మనం చెప్పుకునేది. సెంటూరిపే పట్టణం పై నుండి చూడటానికి అచ్చం మనిషి రూపంలోనే కనిపిస్తుంది. విన్న తర్వాత సందేహం రావొచ్చు.. కానీ ఓసారి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటోంది ఫోటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి.గూగుల్ ఎర్త్ మ్యాప్ లో సెంటూరిపే పట్టణ ఆకారం చూసి.. మనిషి బొమ్మలా ఉందని సందేహం రావడంతో వెంటనే ఆండ్రియా డ్రోన్ కెమెరాల సాయంతో తమ పట్టణాన్ని పలు ఫోటోలు తీశారు. తీరా చూస్తే.. ఇలా మనిషి రూపంలో దర్శనమిచ్చింది సెంటూరిపే పట్టణం. ఈ పట్టణ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఫేక్ అంటూ చాలా విమర్శలు ఫేస్ చేసిందట ఆండ్రియా. తర్వాత అందరూ గూగుల్ మ్యాప్ లో చూశాక తనకు క్షమాపణలు చెప్పారని తెలిపింది. కేవలం 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే.. సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి ఈ సెంటూరిపే పట్టణం పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.