మనుషుల జీవితంలో పెళ్లి అనేది ఓ గుర్తుండిపోయే ఘట్టం. పెళ్లి వయసు రాగానే యువతీ, యువకులు పెళ్లి గురించి ఆలోచించటం పరిపాటి. కొంత మంది పెళ్లిళ్లలోని లోటుపాట్లను తెలుసుకుని వాటికి దూరంగా ఉంటారు. ఇంకా కొంతమంది పెళ్లి చేసుకోవాలన్న కోరిక తారా స్థాయిలో ఉన్నా.. చేసుకోవటానికి ఎవరూ దొరకక అల్లాడుతుంటారు. ముఖ్యంగా పురుషుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పురుషులు జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి పెళ్లి అవుతుండదు. అలాంటి వాళ్లకు అసూయ కలిగించే పని చేశాడు ఓ ముసలాయన. 61 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువకులకు పోటీగా వస్తున్నాడు. ఇప్పటికే ఏకంగా 87 సార్లు పెళ్లి చేసుకున్నాడు. మరికొన్ని సార్లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, వెస్ట్ జావాలోని మజలెంకకు చెందిన కాన్ అనే వ్యక్తి 14 ఏళ్ల ప్రాయంలోనే మొదటి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన కంటే రెండేళ్లు పెద్దదయిన అమ్మాయిని. అయితే, వీరి పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కాన్ ప్రవర్తన కారణంగా రెండేళ్లకే భార్య అతడ్ని విడాకులు అడిగింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. భార్య విడిపోయిన తర్వాత కాన్‌కు విపరీతమైన కోపం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ ధృడమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆధ్యాత్మిక చింతనతో అమ్మాయిల్ని తన వశం చేసుకోవాలనుకున్నాడు. వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు.
చెడు పనులకు పాల్పడటం కంటే, పెళ్లి చేసుకోవటం మేలనుకున్నాడు. అలా ఒక్కో అమ్మాయిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటివరకు మొత్తం 87 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఈ 87 మందిలో 86వ భార్యను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. కాన్ ఈ ఘనతను కేవలం 61 ఏళ్ల వయసులోనే సాధించటం గమనార్హం. కేవలం రైతుగా ఉంటూనే ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు. ‘‘నన్ను వదిలి వెళ్లిపోయిన భార్యలు ఎవరైనా తిరిగి వస్తానంటే.. నేను వద్దనను’’ అంటూ తన మంచి మనసు చాటుకున్నాడు. పెళ్లయిన నెలకే తననుంచి విడిపోయిన ఓ భార్య ఇప్పటికీ తనను ప్రేమిస్తోందని అంటున్నాడు.