భర్త అంటే భరించేవాడు అని పెద్దలు అంటారు. నిజమే కన్నవాళ్లని, తోబుట్టువులను వదులుకుని.. నీ మీద నమ్మకంతో.. నీ వెంట ఏడడుగులు నడిచిన భార్య బాధ్యత భర్తదే. ఆమె సంతోషంలో పాలు పంచుకోవాలి.. బాధలో ఓదార్చాలి.. మొత్తంగా చెప్పాలంటే.. కన్న వారు పంచిన ప్రేమను మరిపించాలి. కానీ మన సమాజంలో భార్య అంటే.. కట్నంతో పాటు వచ్చే ఓ పనిమనిషి అనే భావన చాలా మందికి అలానే ఉంది. మెట్టినింట్లో అడుగుపెట్టింది అంటే.. ఇక అదే తన ప్రపంచంగా మార్చుకోవాలి. ఆమెకంటూ ఇష్టాలు, కోరికలు ఉండకూడదు. ఇంతా చేస్తే ఆమెకు కనీస గుర్తింపు.. ప్రేమతో కూడిన ఓ పలకరింపు కూడా కరువే.
అయితే అందరు భర్తలు ఇంత కసాయి వాళ్లలా ఉండరు. ప్రేమను పంచడంలో తల్లిలా.. బాధ్యతల విషయంలో తండ్రిలా ప్రవర్తించే భర్తలు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఈ కోవకు చెందినదే. భార్య క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది. ఈ విషయం ఆ భర్తను కూడా కుంగదీసింది. కానీ తాను డీలా పడితే.. భార్య మరింత భయపడుతుందని భావించి.. ముఖంపై చిరునవ్వుతో.. క్యాన్సర్ పై భార్య పోరాటంలో నిత్యం మద్దతుగా నిలిచాడు. అంతేకాక క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కారణంగా భార్య జుట్టంతా ఊడిపోతే.. ఆమెలో ధైర్యం నింపేందుకు తాను కూడా గుండు చేయించుకుని.. భార్య మీద ప్రేమను చాటుకున్నాడు. ప్రసుత్తం ఈ దంపతుల ‘గుండు’ కథనం సోషల్ మీడియాలో వైరలవతూ.. కన్నీరు పెట్టిస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మహిళా కానిస్టేబుల్ కు స్టేషన్ లో సీమంతం..
నితిన్ కామత్.. అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. జెరోదా కంపెనీ సీఈవోగా బిజినెస్ సర్కిళ్లలో చాలా మందికి పరిచయమే. కంపెనీ ప్రారంభించడానికి ముందు నితిన్ కాల్‌సెంటర్‌లో పని చేసేవాడు. అక్కడే అతడికి భార్య సీమ పాటిల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడం.. పెళ్లి జరగడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో 2010లో జెరోదా ప్రారంభించడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం చకచకా జరిగిపోయాయి. చిన్న వయసులోనే బిలియనీర్ అయ్యాడు నితిన్ కామత్. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో ఊహించని కుదుపు చోటు చేసుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్..
సీమా పాటిల్ తరచుగా హెల్త్ చెకప్ చేయించుకునేది. ఈ క్రమంలో ఓ సారి ఆమె కుడి వక్షోజంలో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎందుకైనా మంచినది ఆంకాలిజిస్ట్ దగ్గరకు వెళ్లి బయాప్సీ చేయించుకోవాల్సిందిగా సూచించారు వైద్యులు. అప్పుడే సీమకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. రెండో దశలోనే ఉండటంతో.. చికిత్సతో నయమవుతుందని డాక్టర్లు సీమాకు ధైర్యం చెప్పారు. క్యాన్సర్ కణితిని తొలగించేందుకు సర్జరీ చేశారు. కుడి వక్షోజాన్ని పూర్తిగా తొలగించారు. ఇక క్యాన్సర్ కణాలు రొమ్ము వెలుపలకు కూడా వ్యాపించాయి. దాంతో కీమో థెరపీ సూచించారు వైద్యులు.
భార్య కోసం అనూహ్య నిర్ణయం..
కీమో థెరపీ ప్రారంభమయ్యేప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి.. వెంట్రుకలు రాలుతాయి కాబట్టి ముందుగానే సీమ గుండు చేయించుకుంది. భార్యకు బాసటగా నిలిచేందుకు ఆమెకు మనోధైర్యం కలిగించేందుకు నితీన్ తాను కూడా గుండు చేయించుకున్నాడు. చికిత్స కొనసాగినన్ని రోజులు ఇద్దరు గుండుతోనే జీవితం గడిపారు.
బాసటగా నిలిచేందుకే..
భార్యభర్తలిద్దరు గుండుతో ఉండటం పట్ల నితిన్ కామత్ స్పందిస్తూ… ‘‘క్యాన్సర్ పట్ల సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. బయటకి చెప్పకుండా లోలోపలే దాచుకోవడం సరికాదు. అందుకే నా భార్యకు ధైర్యం చెప్పడంతో పాటు సమాజంలో ఉన్న అపోహలు తొలగించాలని అనుకున్నాను. అందుకే ఆమెకు జుట్టు లేనన్ని రోజులు నాకు జుట్టు వద్దు అనుకున్నాను. గుండు చేయించుకున్నాను. మమ్మల్ని చూసి ఎవరైనా అడిగితే.. క్యాన్సర్ గురించి, చికిత్స పద్దతుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్‌గా చెబుతున్నాను’’ అంటున్నాడు నితిన్ కామత్.
ఇది కూడా చదవంవడి: కుమారుడిపై ఓ తల్లి పోరాటం.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇంత కాలం ఈ దంపతుల గురించి కేవలం వారి సన్నిహితులకు మాత్రమే తెలుసు. అయితే ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకుని సీమా తన క్యాన్సర్ స్టోరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యాన్సర్ పట్ల అపోహలు తొలగి పోవాలనే ఈ స్టోరీ పోస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. దీంతో వీరి గుండు వెనుక రహస్యం బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సీమా పాటిల్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారు. భార్యపై నితిన్ చూపిన ప్రేమను ప్రశంసిస్తున్నారు నెటిజనులు. నితిన్ చేసిన మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.