ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు. పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు మరి. ప్రస్తుతం పెళ్లిలో రిసెప్షన్, సంగీత్ వంటివి తప్పనిసరి అయిపోయాయి. అలా ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సంగీత్ లో ఆ పెళ్లికూతురు- మిత్రులు, బంధువులతో కలిసి సరదాగా డాన్స్ చేస్తోంది. అది చూసి తట్టుకోలేని వరుడు ఆమెను అందరూ చూస్తుండగానే చెంప మీద కొట్టాడు. ఆ తర్వాత జరిగిన ఘటన అందరినీ.. ముఖ్యంగా చెంపదెబ్బ కొట్టిన వరుడుని షాక్ కు గురిచేసింది.
ఈ ఘటన తమిళనాడు కడలూరిలోని పన్రుటిలో జరిగింది. ఓ అబ్బాయి- అమ్మాయికి పెళ్లి కుదిరింది. వారి పెళ్లిని చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. జనవరి 20న మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అందుకు ముందురోజు పెద్దఎత్తున సంగీత్ ఏర్పాటు చేశారు. సంగీత్ లో పెళ్లికూతురు ఫ్రెండ్స్, బంధువులతో కలిసి ఆనందంగా డాన్స్ చేస్తోంది. అది చూసిన వరుడుకి నచ్చలేదు. ఆమెను వెళ్లి అలా డాన్స్ చేయకు అని వారించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో అందరూ చూస్తుండగానే వధువును చెంపదెబ్బ కొట్టాడు.
ఆ ఘటనతో ఆగ్రహానికి గురైన వధువు.. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి తన పెళ్లిని క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరింది. అందుకు వారు కూడా సరే అన్నారు. అతనితో పెళ్లి వద్దనుకుని అందరూ కల్యాణ మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి వివాహం ఆగలేదు. అనుకున్న ముహూర్తానికే బంధువుల అబ్బాయితే పెళ్లి చేశారు. ‘సంగీత్ ఆనందాన్ని పంచుతుందని తెలుసు కానీ, ఇలా పెళ్లి కొడుకుల్ని మారుస్తుందని తెలీదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వధువు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.