Viral Video: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న దానిపై ఓ స్పష్టత లేదు. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు.. లేవని బల్ల గుద్ది వాదించేవాళ్లు రెండు రకాలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇక, దేవుడ్ని నమ్మే వాళ్లే ఎక్కువగా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దేవుడంటే నమ్మకం లేని వాళ్లు దెయ్యాలు అంతా ఓ బూటకం అని కొట్టిపారేస్తున్నారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న సంగతి పక్కన పెడితే.. ఓ పట్టణంలోని ఇళ్లపై వింత ఆకారాలు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తెల్లటి ముసుగులో ఉన్న ఆ వింత ఆకారాలను దెయ్యాలుగా భావించి జనం భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, వారణాసి, బడీ గబీ ఏరియాలోని వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీలోని ఇళ్లపై రాత్రిళ్లు తెల్లటి దుస్తుల్లో ఉన్న ఓ వింత ఆకారాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ వింత ఆకారం దెయ్యమే అని జనం భయపడి ఛస్తున్నారు. వారం రోజుల క్రితం ఇళ్లపై తిరుగుతున్న దెయ్యాన్ని వీడియో తీశారు. ఆ కొద్దిరోజులకే మరో రెండు సార్లు ఆ వింత ఆకారం ఇళ్లపై తిరుగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన మొత్తం మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కాలనీలోని జనం గుండెల్లో గుబులు మొదలైంది. రాత్రిళ్లు ఇంటి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
కొంతమంది దీనిపై పోలీసులను ఆశ్రయించారు. తమ ఏరియాలో తిరుగుతున్న వింత ఆకారాలు ఏంటో కనిపెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. వింత ఆకారాల కారణంగా భయం గుప్పిట్లో బతుకుతున్నామని వాపోయారు. వీలైనంత త్వరగా వాటినుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఎవరో మిద్దె మీద దుప్పటి ఆరేసినట్లు ఉన్నారు’’.. ‘‘ అయ్యో! ఈ జనానికి రాను రాను భయం ఎక్కువైంది.. బెడ్ షీటు చూసినా భయపడిపోతున్నారు’’ .. ‘‘ అది నిజమైన దెయ్యం అయితే వీడియో తీసేవాళ్లు కాదు.. పరుగులు తీసేవారు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
बनारस में छतों पर एक सफेद कपड़ा पहने भूत के चलने का वीडियो तेजी से वायरल हो रहा है, चश्मदीदों ने पुलिस से जांच की मांग की है… pic.twitter.com/e8KqvvYIr0
— Banarasians (@banarasians) September 22, 2022