నవమాసాలు మోసేది ‘అమ్మ’
లాలపోసి, చందమామరావే అంటూ గోరు ముద్దలు పెట్టేది ‘అమ్మ’
విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పేది ‘అమ్మ’
తన పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అహర్నిశలు కలలు కనేది ‘అమ్మ’
మరి ఒక స్త్రీ ‘అమ్మ’ కావాలంటే తను ఎదుర్కొనే సవాళ్లు, తను అనుభవించే బాధ మాటల్లో వర్ణించలేం. స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే.. అది ఆమెకు పునర్జన్మ అంటారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఎదురైనా చిరునవ్వుతో తన చిన్నారి కోసం భరిస్తుంది తల్లి. అలాంటి కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని అనుకున్నాడు ప్రముఖ టిక్‌టాకర్ ‘మెయిట్ ల్యాండ్ హాన్లీ’. అనుకున్నదే తడవుగా ఒక పెద్ద పుచ్చకాయను తన పొట్టకు కట్టుకున్నాడు. మరో రెండు చిన్న పుచ్చకాయలను తన ఛాతీ భాగంలో పెట్టుకుని మొత్తం ప్లాస్టర్ చుట్టుకున్నాడు.
అలా పుచ్చకాయలు కట్టుకున్నాక మంచంపై పుడుకుని లేవడానికి ప్రయత్నించి మెయిట్ ల్యాండ్ హాన్లీ విఫలమవుతాడు. ఎంత ప్రయత్నించినా మంచం పైనుంచి లేవలేక పోతాడు. అంతేకాకుండా షూ కట్టుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటి పనులను ప్రయత్నించానని అలా చేయడం వల్ల తల్లిగా స్త్రీలుపడే కష్టాలు తెలిసొచ్చాయని హాన్లీ తెలిపాడు. గర్భిణీలు వారి పనులు వారు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని తెలుసుకున్నానని హాన్లీ తెలిపాడు. అలా మెయిట్ ల్యాండ్ హన్లీ పెట్టిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.